లేతగా నవనవలాడుతున్న బెండకాయ, సైలెంటుగా తన పని తను చేసుకుంటుంది. ఫ్రిడ్జ్ లో ఎంత చలిపెడుతున్నా తట్టుకుంటూ, మౌనంగా  భరిస్తూ, తన కర్తవ్యాన్ని నిర్వర్తించే సమయం కోసం ఎదురు చూస్తూ వున్న ఆ సమయం లో, ఒక రోజు…

ఎర్రగా నిగనిగలాడుతున్న టమోటా ఒకటి తన ఫ్రిడ్జ్ లోకి వచ్చింది. తాగిన నిషా వల్ల వచ్చిన ఎరుపో లేక బాగా ఎరువులేసి పెంచడం వలన వచ్చిన ఎరుపో, అక్కడున్న వేటికీ అర్థం కాలేదు.

టమోటా పొగరుగా ఎవరితోను మాట్లడకపోవటం చూసి మొదట ఎవరూ పట్టించుకోలేదు.

కానీ, ‘టమోటా ల రేటు మండిపతుంది’ అని ఫ్రిడ్జ్ బయట అనుకోవడం మాత్రం అందరికీ వినిపించింది. టమోటా గొప్పదనం అర్థమయ్యాక, అది మాట్లడకపోయినా, అందరూ దానిని గౌరవంగా చూడసాగారు. కానీ బెండకాయ పట్టించుకోలేదు. తన పని తను చేసుకుపోసాగింది. అది చూసిన టమోటా ఈగో దెబ్బతింది. ఎలాగైనా బెండకాయ కన్నా తను గొప్ప అని ఋజువు చేయాలనుకుంది.

పక్కనే వున్న వంకాయతో, బెండకాయ వినేట్టుగా అంది, ‘ఈ రోజు నా రేటెంతో తెలుసా, కిలో 80 రూపాయలు. ఎలా వున్నా ఎగబడి కొంటున్నారు, కానీ కొన్ని కూరగాయలకి నా విలువ తెలీదు’. బెండకాయ విననట్టు నటించింది.

రెచ్చగొట్టటానికి టమోటా మళ్లీ అంది ‘కొన్ని బెండకాయలు ముదిరిపోతాయి, కానీ టమోటాలు ఎప్పటికీ ముదరవు’.

సమాధానమివ్వకపోతె టమోటా ఇలాగే పేలుతూనే వుంటుందని అర్థమైన బెండకాయ, వంకాయతో అంది ‘టమోటాలు ముదరవు కానీ కుళ్ళిపోతాయి, మూణ్ణెళ్ళ క్రితం కొనేవాళ్ళు లేక బస్తాలకు బస్తాలు ఆవులకి మేతగా వేసారు, ఆ విషయం తెలుసో లేదో’.

ఇక టమోటా డైరెక్ట్ ఎటాక్ లోకి దిగింది. బెండకాయ అసలు తగ్గలేదు. ఇద్దరూ తీవ్రంగా వాదించుకున్నారు.

టమోటా: ‘టమోటా పప్పు ఎంత బావుంటుందో తెలుసా?’

బెండకాయ: ‘బెండకాయ పులుసు కన్నానా?’

ట: నాకెంత మంది ఫ్రెండ్స్ వున్నారో తెలుసా?

బెం: నేనొక్కన్ని చాలు.

ట: నన్ను దేంట్లో కలిపితే దానికి పేరు తీసుకొస్తాను, టమోటా పప్పు, టమోటా వంకాయ, టమోటా మునక్కాయ, టమోటా దొసకాయ. చెప్పుకుంటూ పోతే చేంతాడంత. తెలుసా.

బెం: నేను ఎవరితో కలవకుండానే అన్నీ చేస్తాను, బెండకాయ ఇగురు, బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై, బెండకాయ చారు, బెండకాయ పచ్చడి. తెలుసుకో.

ట: నా సర్కిల్ కి చెప్పానంటే, ఒక్క డిన్నర్లో కూడా నువ్వు లేకుండా అంతా మేమే వుంటాము.

బెం: నీకు నీ సర్కిల్ కావాలి, కానీ నేను… I am not one, I am all in one. నాతోనే మొత్తం డిన్నర్ చేసేవాళ్ళు బోలెడు మంది.

ట: రేయ్ య్ య్ య్ య్…..

బెం: ఏంట్రోయ్ య్ య్ య్ య్…..

ఇద్దరూ ఎగిరి ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటున్నారు.

ఇంతలో ఫ్రిడ్జ్ తలుపు తెరుచుకుంది.

‘ఇదేంటీ, టమోటాలూ బెండకాయలు కలిసిపోయాయి. ఎన్ని సార్లు చెప్పానండీ మీకు, కూరగాయల్ని తేగానే సెపరేట్ కవర్లలో పెట్టమని’ బయటినుంచి అరుపు వినిపించింది.

‘ఇప్పుడు వీటన్నింటినీ సెపరేట్ చేయాలి, అదో పని. అయినా, ఈరోజు బెండకాయ టమోటా చేస్తే ఎలా వుంటుంది? వావ్, ఈ రోజు అదే కూర’ మళ్లీ అదే గొంతు అంది ఒక ఎగ్జైట్మెంట్ తో.

కడగడానికి ఒక గిన్నెలో పడ్డప్పుడు, ఒకటినొకటి చూసుకున్నాయి, టమోటా ఇంకా బెండకాయ. ఒక చిన్న నవ్వు రెండిటి మొహాల్లో. నవ్వుతూనే చేతులు కలిపాయి.

ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తున్న భర్త సంతోషంతో అన్నాడు ‘ఇంత అద్బుతంగా ఎలా చేసావు ఈ కూర, బెండకాయ టమోటా కాంబినేషన్ ఇంత బావుంటుందని తెలీదు ఇన్నాళ్ళు’.

-శుభం-

 

PS: ఈ కథకి మరే సినీమా కథకి ఏ విధమైన సంబంధం లేదు అని అనుకుంటే మీరు ఇంకా ఆ సినీమా చూడలేదు అని అర్థం.