రెండు పుస్తకాలు బుధవారం, జూలై 22 2020 

ఆవకాయ తో అన్నం తిన్న తర్వాత, ఆపిల్ పై ని డెసర్ట్ గా తిన్నట్టయ్యింది నా పరిస్తితి ఈ వారం. పూర్తిగా వైరుధ్యమైన రెండు గొప్ప రుచులని అనుభవించానని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశ్యం.

రెండు మంచి పుస్తకాలు వెంట వెంటనే చదివిన అనుభవాలు ఇంతకు ముందే వున్నా, ఈసారి కలిగిన అనుభవం మాత్రం గిలిగింతలు పెట్టింది, ఎంత యాదృచ్చికంగా జరిగినా.

ఒక కథ నిజం, మరోటి కల్పితం, ఒక కథ దళితుల గాథ, మరొకటి బ్రాహ్మణ ఘోష, వైరుధ్యాలతో పాటు ఎన్నో సామీప్యతలు. రెండు కథలూ మూడు తరాల చరిత్రలు. రెండింటిలోను వలస యాత్రలు. ఆచారం ఎక్కువై చదువుకి అడ్డంకులు ఒకరు ఎదుర్కొంటే, ఆచారం తక్కువవ్వటం వల్ల చదువుకోవటం కష్టమైన వారు మరొకరు. ఏదేమైనా రెండూ కదిలించే కథలు. ఏక బిగిన చదివించే బిగువూ, చదివిన తర్వాత మనసులో గూడు కట్టుకొని కొన్ని రోజులపాటు వెంటాడే శైలీ ఈ రెండు పుస్తకాల సొంతం.

 

విషయం లోకి వస్తే, నేను చదివిన మొదటి పుస్తకం, ‘నా పేరు బాలయ్య’, రచయిత వై. బి. సత్యనారాయణ గారు.

ఇది నిజ జీవిత చరిత్ర. మూడు తరాల వీరి వంశ చరిత్ర. దళితులుగా పుట్టి, దొరల కోసం బతుకుతున్న జీవితంలో, ఒక తరం వేసిన మొదటి అడుగు తర్వాతి రెండు తరాల్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో, చదువు ఎంత ముఖ్యమో, ఏమీ లేని బ్రతుకులలో చదువు ఎంత మార్పు తేగలదో ఈ పుస్తకం వివరిస్తుంది. దీనికి సజీవ సాక్ష్యాలుగా వారి జీవితాలే మనకు  కనిపిస్తాయి. ఈ పుస్తకం 2011 లోనే ప్రచురించబడినా,  మొదటి సారి ఈ పుస్తకం గురించి, ‘కబాలి ‘ సినీమా ద్వారానే తెలిసింది. తర్వాత కొన్ని రోజులకి ఈ పుస్తకం కొన్నాను, కానీ మొన్నటి వరకూ చదివే ధైర్యం చేయలేదు. కారణం ముందే ఏర్పరుచుకున్న ఒక అపోహ వల్ల, అంటే దళిత సమస్య అనగానే, చాలా విషాదభరితమైన కథ కావచ్చు,  భీభత్స వర్ణనతో నిండి దయా రసంతో ముగుస్తుందేమో, అలా అనిపించి, దీన్ని చదవటం ఆలస్యమైంది. కానీ చదవటం మొదలుపెట్టాక, ఒక స్వీట్ సర్ప్రైజ్.  చాలా ఆహ్లాదంగా సాగింది. వారు ఎదుర్కొన్న కష్టాల వేడిని, మనకి చలువ కళ్ళద్దాలు తొడిగి చూపెట్టినా, అంతర్లీనంగా, మనకి ఆ సెగ తగులుతూనే వుంటుంది. నా దృక్పధాన్ని విశాలం చేసుకోవడానికి దొరికిన ఒక అవకాశంలా అనిపించింది.

మొదట ఈ పుస్తకం ఇంగ్లీషులో విడుదలయ్యింది. తర్వాత తెలుగులోకి అనువదించబడింది. ఈ పుస్తకాన్ని రచయిత మాతృ భాష తెలుగులో కాకుండా ఇంగ్లీషు లో వ్రాయడానికి కారణం, చదువు యొక్క గొప్పతనం చెప్పడం కోసమే. ఇంగ్లీషు చదివితేనే గొప్ప అని కాదు, కానీ నేటి సమాజంలో విద్యాభివృద్దికి, ఇంగ్లీషు కూడా ఒక సూచనే. ముందు తరం వరకు పాఠశాల విద్య ఎరుగని ఒక కుటుంబం నుంచి ముగ్గురు డాక్టరేట్లు రావడం చిన్న విషయం కాదు.

తెలుగు అనువాదం కూడా చాలా సహజంగా వుంది. మొదటి సారి తెలుగులోనే ఈ పుస్తకం చదివేవారికి, ఇది ఒక అనువాదం అన్న విషయం అస్సలు తెలీనంత బాగా వ్రాసారు.

ఇక రెండవ పుస్తకం ‘సాయంకాలమైంది’, రచయిత గొల్లపూడి మారుతీ రావు గారు.

కథ విషయానికొస్తే, మూడు తరాల ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబ కథ. ఒక అస్పృశ్యుడిని చూసినందుకే వూరు వదిలేసిన తాత నుంచి, సప్త సముద్రాలు దాటి అమెరికా వరకూ వెళ్ళిన మనవడి వరకూ జరిగిన మార్పుల కథ. ఈ పుస్తకం మీద వున్న ఒక ముఖ్యమైన విమర్శ, బ్రాహ్మణిజాన్ని ఎక్కువగా చూపెట్టడం. సనాతన ఆచారాలని విపరీతంగా మెచ్చుకోవటం, అప్పటి కుల వ్యవస్తలో ఏ లోపాలూ లేవన్నట్టు చిత్రీకరించడం ఇలాంటివి, దీన్ని ఒక బాలెన్స్ డ్ రచనగా లేదు అనటం. అది కొంతవరకూ నిజమే అనిపిస్తుంది.

కానీ, ఈ నవల యొక్క ఆయువు పట్టు దీని శైలి. ఇదే నేను చదివిన మొదటి గొల్లపూడి వారి రచన. వారి శైలి అన్ని పుస్తకాల్లోను ఇలానే వుందా, లేక ఈ పుస్తకంలో మాత్రమేనా అనేది, ఇంకా కొన్ని రచనలు చదివి తెలుసుకోవాలి. కానీ ఈ పుస్తకం లో మాత్రం, వారి శైలి అద్బుతం. కాకపోతే వారి శైలి మీద నేను చదివిన మరొక విమర్శ ఏమిటంటే, పాత్రల ద్వారా చెప్పించకుండా వారే దూరి ఎక్కువగా చెప్పారు అన్నది. కానీ ఈ విమర్శ అర్థ రహితం. ఒక రచనని తను చెప్పాలా, తన పాత్రల ద్వారా చెప్పించాలా అన్నది రచయిత ఇష్టం. ఆ విధానం మనకి నచ్చడం, నచ్చకపోవడం వేరే సంగతి. కానీ, వారు ఎలా రాయాలన్నది కూడా మనమే చెప్తే ఇక ఆ రచయిత ఎందుకు?

మరొక ముఖ్యమైన చర్చ, ఈ నవల యొక్క ప్రయోజనం ఏమిటి అని? అసలు ఈ రచన ద్వారా వారు ఏం చెప్పదలుచుకున్నారు అని. నిజమే, ఇది అవసరమైన చర్చే. కానీ, అసలు ఏ ప్రయోజనం ఆశించి ఒక పని చేయాలి? ముఖ్యంగా కళకు ప్రయోజనం ఏమిటి? మనస్సుని రంజింపచేయటమా? లేక సమాజాన్ని ఉద్దరించటమా?

కోడి ముందా? గుడ్డు ముందా? లాంటి  ప్రశ్న ఇది. దీనికి జవాబు, ఎవరి మనసులో వారికి దొరుకుతుంది. దాన్నే మనం వారి అభిప్రాయం అంటాం. మీ అభిప్రాయం ప్రకారం, ఈ రచన మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు.

కానీ గొప్ప కళ యొక్క, ఒక ముఖ్య లక్షణం, వెంటాడటం. మనం అ కళ ని అనిభవించిన తర్వాత కూడా ఆ అనుభూతి మనల్ని వదలకపోవటం. ఆ అనుభూతి ఏదైనా కావచ్చు, భయం, బాధ, ఆనందం, విషాదం, ఏ అనుభూతైనా, ఆ అనుభవం తర్వాత కూడా మనల్ని వెంటాడితే ఖచ్చితంగా అది గొప్ప అనుభవం. మంచైనా, చెడైనా, ఏదైనా సరే. అలా చూస్తే, ఈ పుస్తకం కూడా గొప్ప రచన. చదివిన తర్వాత కూడా ఆ అనుభూతి మనల్ని వదలదు.

ఒకేసారి రెండు విభిన్న ద్వారాలు నా ముందు తెరుచుకున్నట్టనిపించింది, ఈ రెండు పుస్తకాలు చదవగానే. ఏది గొప్ప, ఏది తక్కువ అన్న ప్రసక్తే లేదు. చదువుతున్నంత సేపూ ఊపేసిన రచనలు.

చదివిన తర్వాత ఇంకా చాలా కాలం గుర్తుండిపోయే రెండు పుస్తకాలు ఇవి.

రాచకొండ వారి సంతకం సోమవారం, జన 23 2017 

పది రోజుల కిందట వైజాగ్ జగదాంబ జంక్షన్ లో పాత పుస్తకాల దుకాణాలు తిరిగి కొన్ని పుస్తకాలు కొన్నాను. కొన్ని పాతవి, ఇప్పుడు ముద్రణలో లేని పుస్తకాలు దొరికాయని సంబరపడ్డాను, కానీ అంతకంటే ఆనందకరమైన విషయం మరొకటి ఇప్పుడే బయటపడింది. అదేంటంటే,

స్వయానా ఆయన స్వహస్తాలతో సంతకం చేసిన పుస్తకం. ఎవరో శ్రీ బి. రామాంజనేయులు గారికి 21.09.1977 న రచయిత ప్రసాదించిన పుస్తకం 🙂 ఇప్పుడు నా అద్రుష్టం.

img_9169

‘క’ రాజు కథలు బుధవారం, అక్టో 3 2012 

ఇన్ని రోజులూ ఈ పుస్తకం ఎలా మిస్ అయ్యానో తెలీట్లేదు. చలం గారు ఎక్కడో అన్నట్టు, కవి తన కోసం వ్రాసుకుంటాడు, అది చదివాక మనకేం అర్థమవుతుందనేది మన మీద ఆధారపడివుంటుంది. అర్థం చేసుకునేవాడికి మహాగ్రంథాలు అక్కర్లేదు, ఒక వాక్యం చాలు. సింగీతం గారు ఏ వుద్దేశ్యం తో ఇవి వ్రాసారో తెలీదు. హాస్యం ప్రధాన రసమే అయిన… నాకు ఎందుకో అంత కంటే ఎక్కువగా, ఒక్కో కథా ఒక్కో భయంకరమైన సెటైర్ లా అనిపించాయి.
తెలుగు లో హాస్యం అనగానే ఎక్కువ మందికి ‘జంధ్యాల’ గారే గుర్తొస్తారు. ఇక ఆయన్నే పొగుడుతారు. ఆయన గొప్పవాడే, కానీ ఇంకా గొప్పవాళ్లు ఎంత మంది మరుగున వుండిపోయారో అన్న సందేహం వచ్చింది నాకు, ఇవి చదివాక. నా చిన్నప్పుడు, నాలుగో తరగతి అనుకుంటా… అప్పుడు విడుదలయ్యింది, ‘ఆదిత్య 369’, నా చిన్నతనం లో నేను అద్బుతంగా ఫీల్ అయిన విషయాల్లో ఆ సినిమా ఒకటి. ఆ తర్వాత కొంతకాలానికి ‘భైరవ ద్వీపం’ వచ్చింది, మరో మెస్మరైసర్. అసలే చందమామలు, బాలమిత్రలు తెగ చదివేస్తున్న రోజులు… ఈ సినిమా చూశాక నా ఆనందానికి అంతే ముంటుంది…

 

మళ్ళీ ఇన్నాళ్లకు, కేవలం ఆయన పేరు చూసి ఈ పుస్తకం కొన్నాను, నా చిన్నప్పుడు ఆయన సినిమాలతో ఎంత మెస్మరైస్ చేశారో… ఈ పుస్తకం తో అంతకంటే ఎక్కువే మ్యాజిక్ చేశారు.
కొన్ని కథలు…. ఏమని పొగడాలో నాకు తెలీట్లేదు.
సింగీతం గారూ .. మీరు ఇక్కడ పుట్టడం మా అదృష్టం.
కథల్ని నేను వివరించను… మీరంతా ఈ పుస్తకం కొని చదవాల్సిందే… కొన్ని అద్బుతాల పేర్లు మాత్రం ఇక్కడ….
1. గొప్పవాడు
2. నిజాల గోడ
3. పురోగమనం
4. భజన విజయం
5. ఉత్తరజిత్తు – దక్షిణజిత్తు

ఇవన్నీ చదివాక… ఇవేవో, నేటి సమాజం మీద సెటైర్ల లా అనిపించినా, లేక ఇది ఫలానా వ్యక్తి ప్రవర్తనలా అనిపిస్తోందే అని మీకు అనిపించినా. అది కేవలం మీ ఊహ… అంతే…
కానీ ఒకటి మాత్రం నిజం… మీరెన్ని చదివినా… ఇది చదవక పోతే మాత్రం లోటే…

నేడే చదవండి… తప్పక చదవండి 😉

లోపలి మనిషి ఆదివారం, జూలై 17 2011 

ఒక సీరియస్ పొలిటికల్ సినీమాని, చాలా టైట్ స్క్రీన్ ప్లే లో చూసినంత ఆనందం కలిగింది, ఈ పుస్తకం చదువుతుంటే…

 

నా చిన్నప్పుడు పీ.వీ. గారు మేధావి అనీ, అపర చాణక్యుడు అనీ వింటుండేవాడిని… ఆయన ప్రధాన మంత్రిగా వున్నప్పుడు, రాజకీయాల గురించి అస్సలు తెలుసుకోలేనంత చిన్న వయస్సులో వున్నాను, అది నా దురద్రుష్టం…

 

పీ.వీ. గారిని అభిమానించే వారైనా, విమర్శించే వారైనా, రాజకీయాల్లో తలపండిన వారైనా, అస్సలు రాజకీయాలు తెలీని వారైనా, ఒక్కసారైనా తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.

 

కొన్ని దశాబ్దాల వెనక్కి మనల్ని తీసుకెళ్ళి అప్పటి చరిత్రని కొంచమైనా తెలుసుకునే అవకాశమిచ్చింది ఈ పుస్తకం.

 

ఈ పుస్తకంలోని కొన్ని విశేషాలు (నాకు నచ్చినవి)…

 

1.       ఈ పుస్తకం ఆయన ఆత్మకథ అనుకున్నాను.. కానీ మొదలుపెట్టాక  తెలిసింది. పూర్తిగా ఇది ఆత్మ కథ కాదు అని… ఆనంద్ అనే పాత్ర ద్వారా తన అనుభవాలని మనకు చెప్పారాయన. మొదట్లో కొంచెం నిరాశపడ్డా, ఇందులోనూ ఒక ప్రయోజనం వుందని తర్వాత తెలిసింది… ప్రతీ మనిషిని పేరుతో గుర్తించకుండానే, వారి వారి నైజాల్ని మనకి కళ్ళకు కట్టినట్టు వివరించారు. పుస్తకం చదువుతున్నన్ని రోజులూ, ఏవో సందేహాలు, వాటి జవాబులకోసం వెతకడాలూ.. ఆ ముఖ్యమంత్రి ఎవరు? ఆ ఎమ్మెల్యే ఎవరు? బహుశా ఆ కాంట్రాక్టర్, ఫలాన వ్యక్తేనేమో??? ఇలా… రక రకాలుగా గూగుల్లో వెతికినా, తెలిసిన వారితో చర్చించినా.. కొన్ని ప్రశ్నలకి జవాబులు దొరకలేదు… జవాబులకంటే… ప్రశ్నలే బావున్నాయేమో అని కూడా అనిపించింది…

2.       ఆయన మేధావే… సందేహం లేదు… కానీ మామూలు మనిషి కూడా…

3.       రాజకీయాలు కూడా ఒక వ్రుత్తి, అంతే… మరేమీ కాదు. కొంతమంది…డబ్బు కోసం, కొంత మంది పేరు కోసం, మరి కొందరు అధికారం కోసం, రాజకీయాల్లోకొస్తుంటారు…పోతుంటారు… వీటన్నింటి తో పాటు శాసనాలూ, చట్టాలు… అంతే… సినీమా రంగంలా, వ్యాపారం లా, కార్పొరేట్ సంస్తల్లా రాజకీయం ఒకటి…

4. రాజకీయాల్లో కూడా అనుభవం అవసరం… నిజానికి రాజకీయాల్లోనే అనుభవం అవసరం… చాలా అవసరం… అనుభవం తో పాటు… ఇంకా చాలా కావాలి…

5. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతూనే వుంటాయి… అది ఒక మార్పు… ఏ ఒక్క పార్టీ యో… లేక ఏ ఒక్క రాజకీయ నాయకుడో దేన్నీ మార్చలేడు…వాళ్ళు మార్పు కోసం ప్రయత్నిస్తే వారంలో వస్తుంది… ప్రయత్నించకపోతే ఏడు రోజుల్లో వస్తుంది… అంతే తేడా…

6. మూలక మార్పు ఎందులోనూ వుండదు… ఉపరితల మార్పు మాత్రమే (ఫెరిపెరల్ చేంజ్), రాజకీయాల్లోనూ అంతే… నాటికీ, నేటికీ..

 

పీ.వీ గారి ఆలోచనలు కొన్ని ఆశ్చర్యం కలిగించినా, నాకు మాత్రం భలేగా అనిపించాయి… పుస్తకం లోని ఆ వాక్యాలు యధాతథంగా…

 

* కుల రహిత సమాజం కోసం ఇంటి కప్పు మీద నిలబడి ఘోషించే పెద్దలు, ఆ ఆదర్శాన్ని తాము నిజంగానే విశ్వసించి వుంటే రాజ్యాంగం పీఠికలో ప్రస్తావించి ఊరుకోకుండా ఒకే కులంలో వివాహాన్ని నిషేదిస్తూ చట్టం ఎందుకు చేయలేదు?

* మనిషి ప్రాథమికావసరం సంతోషమేనని నా నమ్మకం. నా జీవనతాత్వికత ననుసరించి, సంతోషంగా జీవించే హక్కు అత్యంత పవిత్రమైన మానవహక్కు గా నేను భావిస్తాను. ఆ హక్కును పక్కకి తప్పించేదేదైనా సరే, అది ఆస్తి కానీ, ఆచారం కానీ, అధికారం కానీ, ప్రతిష్ట కానీ అంతమొందించదగినవే. అప్పుడు ఇదే నా పోరాట పరమార్ధం.

 

పీ.వీ గారి ఆలోచనలే కాక… ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ లో నెహ్రూ గారి వాక్యాలు కొన్ని ఇందులో వున్నయి… అవి ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించాయి…

‘యుద్దాన్ని నేనెంత గర్హిస్తున్నా, భారతదేశం పై జపాన్ దురాక్రమణ జరపగల అవకాశం నన్నే విధంగానూ భయపెట్టడం లేదు. యుద్దం తన బీభత్సాక్రుతిలో దేశం మీద విరుచుకు పడితే బాగుండునని కూడా అంతరాంతరాల్లో నేను కొరుకుంటున్నాను. కోట్లాది ప్రజల ప్రత్యక్షానుభవంలోకి వచ్చి, వారిని బ్రిటిష్ వాళ్ళు రుద్దిన శ్మశాన శాంతి నుంచి ఇవతలకి లాగి నేటి నిష్టుర నిజాల ముందు నిలబెట్టి తమను చుట్టేసిన గతం నుంచి తప్పుకొని ముందుకు సాగడానికీ, క్షుద్రరాజకీయవివాదాలనుంచీ, తమ బుర్రల్లో దట్టించుకున్న క్షణిక సమస్యలను గోరంతలు కొండంతలు చేసుకునే ప్రవ్రుత్తి నుంచి బయటపడడానికి ఓ బ్రహ్మాండమైన కుదుపు ఏదో సంభవించాలని నేను ఆశిస్తున్నాను…

యుద్దాన్ని మనమేమీ కోరుకోవడం లేదు, అయిన అది తలుపు తట్టినప్పుడు జాతి రాటుదేలుతుంది, యుద్దం కలిగించే మహత్తర అనుభవాలనుంచి సరికొత్త జీవితం వికసిస్తుంది. అపార ప్రాణనష్టం సంభవిస్తుంది, నిజమే, కానీ అది అనివార్యం. దీనంగా, హీనంగా జీవించడం కంటే మరణించడమే ఉత్తమం.   మరణం నుంచే కొంగ్రొత్త జీవితం చిగురిస్తుంది. మరణించడమెలాగో తెలియని వ్యక్తులకూ దేశాలకూ జీవించడమెలాగో కూడా తెలియదు. సమాధులు ఉన్నచోటే  పురుత్థానమూ వుంటుంది…’

 

ఇంకా ఇందులో బాగా అసక్తిని రేకెత్తించిన ఘట్టాలు…

 

1. ఒక ప్రాజెక్టు అనుమతి కోసం ముగ్గురు కాంట్రక్టర్లు వేసిన ఎత్తుగడలు,

2. భూ పరిమితుల బిల్లుని శాసన సభలో ఆమోదింపజెయ్యటం…

3. పాకిస్తాను తో యుద్దం, చైనాతో యుద్దాం.

4. ముఖ్యమంత్రిగా ఆనంద్ ని తప్పించటం…

 

సగటు పుస్తక అభిమాని తప్పకుండా చదవాల్సిన  పుస్తకం ఇది. పీ.వీ గారి గురించి ఎవరో చెప్పగా విని, వ్రాయగా చదివి పెంచుకున్న అభిమానం కంటే… ఆయన గురించి ఆయన వ్రాతల్లో చదివి తెలుసుకున్న తర్వాత స్పష్టతతో కూడిన అభిమానతో వచ్చిన గౌరవం బావుంది…

 

రాజకీయాల గురించి, స్వాతంత్ర్యానంతర రాజకీయాలు టెస్ట్ బుక్ లా కాకుండా, హాస్యంతో కూడిన నిష్టుర సత్యంలా కావాలంటే… ఈ పుస్తకం చదవండి… చదివాక పీ.వీ.గారు అర్థమయితే అది బోనస్…

2 States… ఆదివారం, జన 10 2010 

రెండు రాష్ట్రాలు,రెండు సంస్క్రుతులు, ఇద్దరు ప్రేమికులు, ఒక పెళ్ళి…

పూర్తిగా ఒక భారతీయ ప్రేమ కథ. ఇదీ చేతన్ భగత్ “2 స్టేట్స్” నవల.

ఒక పంజాబీ అబ్బాయీ, ఒక తమిళమ్మాయి ప్రేమించుకుంటే, ఆ ప్రేమని పెద్దల అనుమతితో పెళ్ళి వరకు తీసుకెళ్ళడానికి ఏమేం చేయ్యాల్సొచ్చిందనేది కొంచెం హ్యూమరస్గా, అక్కడక్కడా సీరియస్గా చెప్పారు.

IIMA లో మొదలయ్యి, ఢిల్లీకి వెళ్ళి, అక్కణ్ణించి చెన్నైకి వెళ్ళి, మళ్ళీ ఢిల్లీకి వచ్చి… మధ్యలో గోవాలో ఆగి. చివర్కి… D-C-D-C ల్లో షట్టిల్ చేసి చివరికి చెన్నై లో ముగుస్తుంది. చేతన్ narration బావుంది. చివరి వరకు చదివింప చేస్తుంది. నిజానికి సెలవు రోజుల్లో చదివాను కాబట్టి, నాన్-స్టాప్ గా నాతో చదివించింది… ఒకట్రెండు అతిశయోక్తుల్లాంటి సంఘటనలని కథలో వాడుకున్నా మిగతా అన్నీ రియలిస్టిక్ గా అనిపిస్తాయి… తన జీవితం లో జరిగిన సంఘటనలు కొన్ని ఇందులో వున్నాయని రచయితే ముందుగా చెప్పుకున్నారు… May be అందుకేనేమో…

ప్రేమించీ, పారిపోకుండా పెద్దల అనుమతితో ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారో చెప్పిన వాదన బావుంది. అలాగే ప్రేమలో పడ్డ తర్వాత ఎలాంటి బాధ్యతల్ని తీసుకోవాల్సొస్తుందో చదివితే ఫన్నీగా వుంది.

మొత్తమ్మీద సరదాగా చదువుకోదగ్గ పుస్తకం…

PS: మొత్తం కథ చదివాక, ప్రేమలో పడ్డాక,పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకోవాలనుకుంటే, అబ్బాయే ఎక్కువ ఎక్కువ స్ట్రగుల్ అవ్వాలేమో అనిపించింది 😉

అబ్బాయిలూ జాగ్రత్త… 😉

దైవమిచ్చిన భార్య లో మంచి ముత్యాలు – నాకు నచ్చినవి మాత్రమే సోమవారం, జూన్ 15 2009 

“దైవమిచ్చిన భార్య” రెండో సారి చదువుతున్నప్పుడు అందులోని కొన్ని వాక్యాలు అలా హత్తుకున్నాయి. అందులో కొన్ని చాలా సింపుల్ గా గొప్ప భావాన్ని చెప్తాయి.

కథ మొదలవుతూనే ఉన్న చిన్న వాక్యం” ఆ రోజుల్లో యేది చూసినా, నవ్వుగా, ఆనందంగా వుండేది”

ఏ రోజుల్లో?? రాధా క్రిష్ణ (హీరో) చిన్ననాటి రోజుల్లో… బాల్యం గురించి అంతకన్నా గొప్పగా అంత చిన్న వాక్యంలో చెప్పగలరా ఎవరైనా??? ఏమో???

మరో చోట చిన్న రాధా క్రిష్ణ కొచ్చిన ఒక డౌటు ” యీ పెద్దవాళ్ళు యెందుకో చీదరించుకుంటో, కోప్పడుతో, ఏడుస్తో, బతుకుతారు. అట్లా బతక్కపోతేనేం? ఆకాశం, మబ్బులూ, పువ్వులూ, చిలకలూ, రైళ్ళూ నీళ్ళూ… ఇన్ని వుండగా, యీ పెద్దవాళ్ళకి… సంతోషం లేకపోవడమేమా అని సందేహం”

నిజ్జంగా నిజం… అప్పుడెప్పుడో నడక లాంటి జీవనంలోనే ఆ లోటుని అనుభవించగలిగారు చలం గారు. మరి ఇప్పటి మారథాన్ పరుగులను చూస్తే ఏమనేవారో??

పెద్దయిన రాధ క్రిష్ణ నుంచి వాగ్దానం తీసుకుంటూ పద్మావతి అంటుంది…

“స్త్రీలు యెందుకనుకున్నావు వుంది? జీవితమంటే ఎంత ఉన్నతమయిందో, గాఢమయిందో, పురుషునకి తెలిసేట్టు చెప్పేందుకు. పురుషుల్ని ప్రోత్సహించాలి, స్వర్గానికి యెత్తెయ్యాలి… గొప్ప పనులకీ, గొప్ప ఆదర్శాలకి, గొప్ప వూహలకి వుత్సాహమివ్వాలి. అగ్ని తో నింపెయ్యాలి. నిర్జీవమైన బతుకులోంచి రక్షించాలి. వాగ్దత్తం చెయ్యి, యెన్నడూ యీ సామాన్యపు దేశ సేవకులమల్లే, ప్రజ్జలమల్లే, తుక్కు కింద, శవాకారం కిందా తయారుకానని. వెదవ బ్రతుకు. పాడు మొహాలు వేసుకొని, కళ్ళ మీద పొరలు కమ్మి, కుళ్ళు నవ్వులు నవ్వుకుంటో, మర్యాదలో, గౌరవంలో, భయంలో, పిరికితనంలో, ధర్మాచరణంలో, సనాతన ధర్మంలో, మత్తులో, కొంచం కొవ్వెక్కి గుండ్రంగా తయారీ, పిర్రలు బలిసి, అలా బతకనని వొట్టెయ్యి” చదవగానే హత్తుకుపోయిన వాక్యాలు.

ఇంతే బాగా పురుషుడి గొప్పతనాన్ని, బాధ్యతని చెప్పి వుంటే బావుండేదనిపించింది…

తను గొప్పవాన్నయే వరకూ తన కోసం వేచి యుండమని 🙂 రాధా క్రిష్ణ అన్నప్పుడు పద్మావతి చెప్పిన మాటలు. “నేను మాత్రం అనుభవించక్కర్లేదూ? నాకు మేడలూ, నౌకర్లూ, హోదా, గౌరవం కావాలి. నాకు నువ్వెంత గొప్పవాడివి కావలనుందో, నేనూ అంత గొప్పదాన్ని కావాలని నాకూ వుంది.నూవు నా కోసం గొప్పవాడివి కాబోతుంటే, యే మూలో దిక్కు లేక పడివుండనా నేను? అప్పుడు నన్ను చూస్తే, నీకెలా వుంతుంది? నేనూ గొప్పదాన్ని కావాలి, నీ కళ్ళని మెరిపించి, నీ మనసు లాగేసి, నీ కొర్కెని మండించి, నిన్ను నా పాదాల దగ్గర ఆరాధింపచేసే మహాసుందర శక్తి కావాలి నేను. నేను వంటదాన్నయి, దాన్ని పోషించే వాడివి నువ్వయి, యిద్దరం తయారయితే, నీకు వంటదాని మీద యేమి ప్రేమ వుంటుంది?”

ఎవరో గుర్తొస్తున్నారు, ఈ మాటలు వింటుంటే, ఎవరబ్బా అది?? స్కార్లట్ ఓ హారా నా?? ఏమో???

చాలా యేళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు పద్మావతి అంటుంది. “మన బ్రతుకంతా ఎందుకూ పనికి రాని పనులతో సరిపోతుంది!!! ఇంత అందం లోకంలో వుంది. అందమైన స్థలాలూ, వస్తువులూ, భావాలు, ఎన్నో వున్నాయి, కానీ మన జీవితానికీ, వాటికీ సంబందం లేదు. వాటినుంచి దూరం చేసుకోని, జీవితాలని చెడగొట్టుకుంటాము” సున్నితమైన భావుకత.

అందుకే చలం గారి రచనలు నాకిష్టం. పసిపిల్లల అమాయకత్వాన్ని అలాగే వుంచుకొని, దాతో ప్రతీ ఆనందాన్నీ ఆస్వాదించి, కరడు గట్టిన జీవితంలోని చేదు నిజాల్నీ అంతే బాగా వెల్లడించగలగటం…

ఈనాటి మహాగ్రంధం లో పద్దెనిమిది పర్వాలు కాదు, పద్దెనిమిది పేజీలే అన్నట్టు… అర్ధం చేసుకునేవాడికి ఒక్క వాక్యం చాలదూ…

వెయ్యేళ్ళ నాటి మధువు…. ఉమర్ ఖయ్యాం ‘రుబాయీలు’ బుధవారం, జన 28 2009 

ఈ రోజుల్లో 10 రూపాయలకి మధురమైనవి ఏం దొరుకుతాయా అని ఆలోచిస్తే, వేళ్ళ మీద లెక్క పెట్టే అన్ని కూడా గుర్తు రావు కదా. కానీ నాకు మాత్రం దాదాపు వెయ్యేళ్ళ క్రితం దాచిన మధువు దొరికింది. ఆంత పాతదీ… అమౄతంతో సమానమైనదేమో కూడా, అది ఉమర్ ఖయ్యాం ‘రుబాయీల’ రూపంలో….చలం గారి అనువాదం లో… అచ్చ తెలుగు లో…

మామూలు మధువు సేవిస్తే, ఆ అనందం గంటల్లోనో, లేదా రోజులోనో పోతుంది… కానీ ఈ మధువు సేవిస్తే, ప్రతీ రోజూ ఏదో ఒక సందర్బంలో, ఏదో ఒక సంఘటనలో… ఆ మత్తు అనుభవానికి వస్తూనే వుంటుంది. ఒక జీవితమంతా వెంటాడే మత్తు ఇది. ఓక గొప్ప వేదాంతి జీవితం స్రవించిన మధువు. మతాన్ని ఎదిరించి, తత్వ మూలాధారా ప్రశ్నలకు విప్లవాత్మకంగా, భావుకతని అద్ది, నిజాల్ని వాదనకతీతంగా, కర్కశంగా చెప్పిన వాడు ఉమర్ ఖయ్యాం. ఆతను 1048 లో ఇరాన్ లో జన్మించి, 1122 లో మరణించాడు. ఆతని కవితా పాండిత్యం వల్ల, గణిత, ఖగోల శాస్త్రవేత్త గా అతనికున్న ప్రతిభ కొంచం మరుగున పదిందంటారు. నాలుగు వాక్యాలలో వ్రాసే ‘రుబాయీలు’ సుమారు, వెయ్యి వరకు వ్రాసాడు. ఆందులోనుంచి దాదాపు 105 రుబాయీలని తెనిగించి మనకందించారు చలం గారు. సాధారణ తెలుగులో, అంత మంచి భావాలని చెప్పటం చలం గారి గొప్పతనం (ఈ విషయం, చలం గారి ‘గీతంజలి’ చదివినవారికి బాగా తెలుస్తుంది) గాలిబ్ గీతాలతో పోలిస్తే, ఈ రుబాయిలే ఇంకా బాగా నచ్చాయి నాకు. విమర్షనా ధోరణి తో చదివితే, మధువూ, ప్రియురాలు తప్పితే, జీవితంలో వేరే ఏమీ లేదా అనిపించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానంగా నాకు అమరావతి కథల్లోని ఒక కథ గుర్తుకొస్తుంది. ఆందులో చాల సాదారణంగా బ్రతికే ఒక పాత్ర దినచర్యని వర్ణించిన తర్వాత, రచయిత ఇలా అంటాడు ‘ఎవ్వరికి తెలీనట్టుగా ఇలా బ్రతికితే చాలదా? ఛాలదనే అంటున్నరు నేటి జనం” అని. ఆలాగే అలెగ్జాండర్ పోప్ ది “The Happy Man ” అనే పద్యం గుర్తొస్తుంది… అందులో అంటాడు

 ‘’ Thus let me live, unseen, unknown; 

Thus unlamented let me die;

Steal from the world, and not a stone 

Tell where I lie.  ” అని.

ఈ విషయాల్నే అందరికంటే ముందుగా, ఇంకా నిజాయితీగా చెప్పాడనిపించింది. ఏన్నో పద్యాల్లో ఈ విషయం బోధపడింది. ఇంకా వాటి గొప్పతనాన్ని వర్ణిచటం కంటే.. మచ్చుకి కొన్ని ఇక్కడ ఇస్తున్నాను…

  • నీకు స్వర్గం పైన వాంచ వుంటే,

             మఠాల వెంటా, మసీదుల వెంటా తిరుగు.

            నాకు మాత్రం మధువూ, ప్రియురాలు చాలు,

            నేను నరకానికి పోతానంటావా, పోనీ, చింత లేదు.

 

  • చెట్టు నీడలో కూచున్న మనకేం కావాలి,

             ఓ రొట్టె, ఓ కావ్యం, మధువు.

             నా పక్కన కూచొని పాడుతూ నువ్వు,

             ఎడారి స్వర్గమవుతుంది.

 

  •  ఈ పురాతన సత్రానికి రెండే వాకిళ్ళు…రాత్రింబగల్లు,

               ఆ ద్వారాలలోంచి సుల్తాను తర్వత సుల్తాను ప్రవేశించి, పరిపాలించాడు, అనుభవించాడు,

              ఏ గుర్తూ లేకుండా వచ్చిన దారినే పొయినాడు.

ఇలాంటివి ఇంకా ఎన్నో పద్యాలు… అరుణా పబ్లిషింగ్ హౌస్ ద్వార విడుదలైన ఈ పుస్తకం వెల 10/-

మీరూ ఈ మధువుని అనుభవిస్తారని ఆశిస్తూ…

ప్రవహించే ఉత్తేజం “చే గెవారా” గురువారం, జన 22 2009 

సోషలిజం, కమ్యూనిజం, కాపిటలిజం … ఇంకా ఏమేమో  ఉన్నాయి . కానీ “చే” గురించి చదివాక గుర్తుకొచ్చింది  ఒక్కటే, ‘హ్యూమనిజం’ లేదా ‘మానవత్వం’ మిగతా అన్నింటికన్నా ముఖ్యమైనది . ‘ఛే ‘… అతని ఫొటొలు ఈ మధ్య చాల చోట్ల చూడడం వల్ల, షాపులో అతని బొమ్మతో ఈ పుస్తకం కనపడగానే తీసుకున్నాను. ‘కాత్యాయని ‘ గారు వివిధ పుస్తకాల్లోంచి సేకరించి,  క్రోడీకరించిన ‘చే’ జీవిత విశేషాలే … ఈ పుస్తకం. రచన చాలా సరళంగా సాగిపోయింది. అక్కడక్కడా, వివరాలు మరీ ఎక్కువగా ఇచ్చినట్టనిపించినా, ఒక్కో చోట ఇన్ని వివరాలు ఎలా సేకరించారో అన్న ఆశ్చ్యర్యం కలిగింది. పుస్తకం విషయానికొస్తే , ‘చే’ బాల్యంతో మొదలయ్యి, ఆయన మోటార్ సైకిల్ యాత్ర, క్యూబన్   విప్లవోద్యమంలోకి ఓ కార్యకర్తగా ప్రవేశించటం, విప్లవం విజయవంతమవ్వటంలో పోషించిన కీలక పాత్ర, తర్వాత ఏర్పడిన  నూతన ప్రభుత్వం లో నిర్వహించిన వివిధ బాధ్యతలు, తర్వాత రాజీపడని మనస్తత్వం వల్ల, క్యూబా పౌరసత్వానికి రాజీనామా చేసి కాంగో విప్లవోద్యమంలోకి వెళ్ళటం, అందులో పరాజితులై, బొలీవియన్ ఉద్యమంలో పోరాడి అమరుడవ్వటం వరకు… ఓ అద్బుత చరిత్ర.. ఈ పుస్తకం చదివిన తర్వాత, మార్క్సిజం గురించి తెలుసుకోవాలన్న కోర్కె ఏర్పడింది.  ఈ పుస్తకం లోనే అన్నట్టు, ‘చే’ ఉద్యమ రాజకీయాల మీద లోతైన  చర్చ ఎక్కడా జరుగుతున్నట్టు లేదు. ప్రస్తుత పరిస్తితుల్లో, క్యూబా కూడా  తమ విలువల మీద రాజీపడుతున్న ధోరణి చూస్తుంటే, కేవలం కొన్ని   దశాబ్దాల తేడాలో ప్రపంచంలోని నాయకుల నైతికత ఇంత దిగజారిందా అన్న అనుమానం కలుగుతుంది.

మొత్తమ్మీద చరిత్ర మీదా, గొప్ప వ్యక్తుల మీదా, అభిమానం  వున్నవాళ్ళూ తెలుసుకోదగ్గ విశేషాలు ఉన్న పుస్తకం ఇది.