సీ’రియల్ ‘ సోమవారం, జన 3 2011 

… మెలో డ్రామాని దట్టించిన ఒక పాత మూస కథ… కానీ ఇప్పుడూ మార్పు లేదు… 😉

విజయాన్నీ, మత్తునీ పక్క పక్కనే పెడితే మత్తు కన్నా ప్రమాదకరమైనది విజయం. మత్తునైనా మరోసారి మరవచ్చు గానీ విజయాన్ని ఒక్క సారి అనుభవిస్తే మరోసారి ఓటమిని అంగీకరించలేరు.

అలాంటి విజయాన్ని, మత్తులో రంగరించి ఒంటరిగా ఆస్వాదిస్తున్నాడు శరత్. బాటిల్లోని ఆనందాన్ని కొంచం గ్లాసులోకి వంపి, కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ, టీవి చూస్తున్నాడు. రెండు నిమిషాల యాడ్స్ తర్వాత సీరియల్ మొదలయ్యింది. అతను వ్రాసిన సీరియల్ “పతివ్రత” వందవ ఎపిసోడ్ ఆ రోజు. వరుసగా అతని మూడో సీరియల్ ఆ ఘనతని సాధించింది. అదీ ఆనందం. అతని భార్య పుట్టింటికి వెళ్ళటంతో ఒంటరిగా ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. టీవీలో   ఆ రోజు సీరియల్ బదులు, నటీ నటులు, టెక్నీషియన్ల తో ఇంటర్వ్యూని ప్రసారం చేస్తున్నారు.

కొద్దిసేపటి తర్వాత  స్క్రీన్ మీద శరత్ ప్రత్యక్షమయ్యాడు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు  క్రుతజ్ఞతలు    మరియు తన అనుభవాలు చెప్తున్నాడు. గంట సేపటి స్పెషల్ ప్రోగ్రాం అయిపోగానే ఫోన్ మోగింది.

ఏడుకొండలు చేశాడు, ఫోనెత్తగానే “ఏమయ్యా… కంగ్రాట్స్” అన్నాడు. అతనే శరత్ మూడు సీరియల్ల నిర్మాత. “చూశావ్ గదా ఎంత క్రేజొచ్చిందో మన సీరియల్కి. ఇంకో పది ఎపిసోడ్లలో ముగిస్తానంటున్నావు. మరోసారి అలోచించు. డైరెక్టర్ కూడా అంటున్నాడు మరో 50 ఎపిసోడ్లన్నా పెంచాలని” సూటిగా విషయం చెప్పాడు.

“ఏడుకొండలు గారూ. ముహూర్తం రోజు నుంచీ చెప్తున్నాను. మన సీరియల్ 110 ఎపిసోడ్లే అని మళ్ళి ఇంకో 40 ఎపిసోడ్లు పెంచమంటారేంటీ?” కొంచం తీవ్రంగానే అన్నాడు శరత్.

“అదికాదయ్యా, బాబూ. మన ముందు సీరియల్లకి కూడా లేని క్రేజు దీనికొచ్చె. జనం ఎగబడి చూస్తుండె. అనుకున్నదింతే అని ఇప్పుడే ఆపితే బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకున్నట్టే కదా?” కొంచం బతిమాలుతున్నట్టుగా అన్నాడు ఏడుకొండలు. అతను చాలా డిప్లొమాట్, అందుకే చాలా తొందరగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించాడు. అసలు ఒక నిర్మాత, ఒక రచయితని ఇంతగా అడగడు, కానీ ఏడుకొండలు అలా కాదు. తన పనికోసం కాళ్ళూ పట్టుకోగలడు, జుట్టూ పట్టుకోగలడు.. ఆ విషయం బాగా తెలుసు శరత్ కి. అయినా చివరి ప్రయత్నంగా అన్నాడు “అనుకున్నట్టు తీసాం కాబట్టే జనం ఎగబడి చూస్తున్నారు.ఇంకా సాగతీస్తే, అప్పుడెవరూ చూడరు. ఇప్పుడు ఆపితే కనీసం మంచి పేరయినా మిగుల్తుంది”.

అవతలి వైపు మౌనం. శరత్ కి తెలుసు ఏడుకొండలి మనస్తత్వం. కానీ, ఈ పని తనకిష్టం లేదు కాబట్టే ఇన్నిసార్లు చెప్పాడు, తర్వాత అతనిష్టం.రెండు నిమిషాల మౌనం తర్వాత అన్నాడు ఏడుకొండలు.
“ఈ సీరియల్ని ఆపేయటం నాకిష్టం లేదు. నీకంతగా ఇష్టం లేక వ్రాయలేననుకుంటే చెప్పు. వేరేవాళ్ళతో వ్రాయిద్దాం. తొందరేం లేదు. రేప్పొద్దున్న ఆఫీస్ కి వచ్చేటప్పటికి అలోచించు. ఎకౌంట్ సెటిల్ చెయ్యాలో? స్టొరీ డిస్కషన్స్ కి రూం బుక్ చెయ్యాలో. నీ ఇష్టం”. అని పెట్టేశాడు.

పరిస్తితులు ఇలా రావొచ్చొని ముందే వూహించాడు శరత్. అవసరమైతె చివరి అస్త్రాన్ని ఉపయోగిస్తాడని తెలుసు. అయినా ఇప్పుడు తను కేవలం తన ఆనందం కోసం వ్రాసుకునే రచయిత కాదు. తన ప్రోడక్ట్ ని జనానికమ్మే వ్యాపారవేత్త. మనుగడ కావాలంటే కొంత??? సంత్రుప్తిని కోల్పోక తప్పదు.

కొంచం సేపటి క్రితం వున్న ఆనందం ఫోన్లో మాట్లాడగానే ఆవిరయ్యింది. ఇంతకు ముందు ఆనందాన్ని పెంచడానికి తాగిన మందు ఇప్పుడు విషాదాన్ని పంచుకోవడానికి సిద్దపడినట్టుగా వుంది. చిన్నగా నవ్వుకొని మరో పెగ్గు పోసుకోబోతుంటే కాలింగ్ బెల్ మోగింది.

గ్లాస్ పక్కన పెట్టి వెళ్ళి తలుపు తీసి, వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా అన్నాడు “మాలినీ”.

“లోనికి రానిస్తే ఇద్దరం కలిసి ఆశ్చర్య పోవచ్చు” నవ్వుతూ అంది మాలిని. “ఓ సారీ, రా…రా” అంటూ లోపలికి దారి తీశాడు.

బాటిల్సూ, ఇతర సరంజామా అంతా సర్దబోతుంటే అంది మాలిని. “నువ్వు తాగితే నాకేం అభ్యంతరం లేదు శరత్. ఆడ కంపెనీ నీకిష్టం లేకపోతే వదిలెయ్యి. నాకు మాత్రం ఏదైనా సాఫ్ట్ డ్రింక్ ఇవ్వు” అంది.

ఫ్రిజ్లోంచి కూల్ డ్రింక్ తీస్స్తూ అన్నాడు “నువ్వు మా ఇంటికి రావడం ఆశ్చర్యంగా వుంది. షూటింగున్నట్టుంది కదూ ఈ రోజు? అయిపోగానే ఇటే వస్తున్నావా?”. మాలిని “పతివ్రత” సీరియల్ లో హీరోయిన్.

“అవును!!! ఈ రోజు క్లైమాక్స్. కొండమీదినుంచి దూకి చనిపోయే సీన్. చాలా నేచురల్ గా వచ్చింది” అంది. ఆమె కంఠంలో చిన్న జీర.
    
అది గమనించకుండా ఆమె చేతికి కూల్ డ్రింక్ ఇచ్చి, తను పెగ్గు తీసుకుంటూ అడిగాడు. “భోంచేసావా? ఏమైనా చెయ్యమంటావా?”. అతనికీ, మాలినికీ మంచి రిలేషన్ వుంది. ఇండస్ట్రీ కొచ్చిన కొత్తల్లో శరత్ కి చాలా మోరల్ సప్పొర్ట్ ఇంచ్చింది మాలిని. అందుకే ఆమె పట్ల చాలా అభిమానంగా వుంటాడు శరత్.

సూటిగా అసలు విషయం చెప్పింది మాలిని. “శరత్, ఈ సీరియల్లో నటిస్తుంటే నాకు లోకం మీదే నమ్మకం పోతుంది. ఒక్కటీ మంచి కారెక్టర్ లేదు. అన్నీ నన్ను అనుమానించి, అవమానించే కారెక్టర్లే. వీళ్ళందరికీ భయపడి నేనాత్మహత్య చేసుకోవడం. నాకస్సలు నచ్చలేదు. దయచేసి క్లైమాక్స్ అయినా మార్చగలవా? చనిపోయినట్టు కాక హోటల్లో కప్పులు కడుగుతూ బ్రతికినట్టు చూపినా సరే. ఏమంటావు?” 

అతనికి ఆశ్చర్యంగా వుంది. ముందు నుంచీ మాలినికి ఈ కారెక్టర్  ఇష్టం లేదు అన్న విషయం తెలుసు కానీ ఇన్ని ఎపిసోడ్ల తర్వాత ఇప్పుడు బయటపడింది. ఆమె అంత బాగా నటించడానికి కారణం అప్పుడు తెలిసింది. ” నాకు ఆడవాళ్ళలో మంచి పేరయితే (సానుభూతి??) వచ్చింది కానీ, ఈ రొటీన్ చవకబారు సీరియల్లలో నటించీ, నటించీ నాకు విసుగొచ్చింది. నాకు రిలేషన్స్ మీద నమ్మకం పోతుంది” అంది.

“చవకబారు” అన్న పదం ఉపయోగించిందుకు హర్టయ్యాడు శరత్.

అలా సడన్ గా వచ్చి తన తన రచనలని తన ముందే విమర్శిస్తే, తట్టుకోలేకపోయాడు.

“అంటే నేను రాసినదంతా చెత్త అనేనా నీ వుద్దేశ్యం” అన్నాడు. మాలిని మాట్లాడలేదు.  “ఏం మంచి లేకుండానే నా సీరియల్స్ టాప్ రేటింగ్స్ లో నిలబడతాయా?” అన్నాడు. నిజానికి అతనికీ తెలుసు, ఏం వ్రాయాలనుకున్నాడో? ఏం వ్రాస్తున్నాడో.
అప్పటి వరకూ మౌనంగా వున్న మాలిని కొంచం ఆవేశంగా అంది “ఏం మంచి వుంది నీ సీరియల్లలో చెప్పు. రేటింగ్స్ లో టాప్ పొజిషన్లో వుండటం, ఎక్కువమంది నీ సీరియల్ చూడటం… ఈ కారణాల వల్ల నీ సీరియల్ మంచిది అనుకుంటే అది నీ ఫూలిష్ నెస్స్. నీ మొదటి సీరియల్ “బానిస”, ఇద్దరు పెళ్ళాల మొగుడి కథ. మొగుడు వద్దన్నా, తిట్టినా, కొట్టినా,  అతన్నే పట్టుకు వేళ్ళాడే బానిసల కథ. రెండో సీరియల్ “కుటుంబం” , ఒక్కరు కూడా మరొకర్ని నమ్మని గొప్ప కుటుంబం. మొగుడి మీద పెళ్ళానికి, అత్త మీద కోడలికి, తల్లి మీద కొడుక్కి అపారమైన అనుమానం. ఇప్పుడు “పతివ్రత” శారీరకంగా చెడిపోకుండా తన అన్ని బలహీనతలకి మంచితనం ముసుగేసుకున్న ఓ అబల కథ. నీకు హ్యాట్సాఫ్ శరత్. ఆడవాళ్ళ బలహీనతని అద్బుతంగా క్యాష్ చేయగలిగే నీ టాలెంట్ కి”.

ఆమెనే చూస్తుండిపోయాడు శరత్. ఆమె మాటలు విని ఎంతగా ఆశ్చర్యపోయాడంటే, కొద్ది సేపు మాట్లడలేదు. గాఢ నిద్రలో వున్నవాడి మీద బకెట్ నీళ్ళు కుమ్మరించినట్టయ్యింది. ఒక్కసారిగా వచ్చి అన్నీ నిజాలే మాట్లాడితే తనేం చెప్పగలడు. తాగిన ఏ కొంచమో వుంటే , ఆ మత్తూ దిగిపోయింది. చివరికి అన్నాడు.  “మరైతే ఏం వ్రాయమంటావు? మంచే రాస్తాం!!! అంతా మంచే రాస్తాం. నువ్విలా వుండు, నువ్వా తప్పు చెయ్యకు అంటూ ప్రవక్తల్లాగా భోదిస్తాం. ఎంత మంది చూస్తారు? ఎన్ని రోజులు చూస్తారు? ప్రజలు టీవీ చూసేది వినోదం కోసం కానీ, నీతి పాఠాల కోసం కాదు” చిన్నగానే అన్నాడు, కానీ కరుగ్గా అన్నాడు. ఆ మాటల్లో…  తనలో పేరుకున్న ఫ్రష్ట్రేషన్ కొంచం బయటపడింది.

అతను కరెక్టుగా రావల్సిన పాయింట్ కే  వచ్చడన్నట్టు అంది “కరెక్ట్, వాళ్ళు చూసేది వినోదం కోసం, ఒప్పుకున్నావ్ కదా? మరి మీరు వినోదం ఇవ్వాలిగానీ, ఏడుపులూ, పెడబొబ్బలూ, అనుమానాలూ,  హత్యలు, పగలు, ప్రతీకారాలు, రంకులు, బొంకులూ, ఇవ్వి కాదు. ఇవి కాదు వాళ్ళకి కావల్సింది. ఒక భర్త, భార్యతో ఎంత బాగా వుండొచ్చో, తల్లి దండ్రులు, తమ పిల్లలతో ఎంత ఆనందంగా వుండొచ్చో, అత్తా, కోడళ్ళ రిలేషన్ ఎంత గమ్మత్తయినదో, ఒక ప్రియుడు, తన ప్రేయసిని ఎంత బాగా ప్రేమించొచ్చో, చుట్టూ వున్నవాళ్ళతో మన అనుభందం ఎంత ఆహ్లాదంగా వుండొచ్చో చెప్పు. ఇన్వన్నీ చాలా సహజమైన విషయాలు, వీటన్నింటినీ ఎంత వినోదాత్మకంగా చెప్పొచ్చో అలోచించు. ఇది చెప్పడానికి కూడ ఒక అత్త, ఒక కోడలు, ఒక కొడుకు, ఒక భర్త, ఈ కారెక్టర్ల్లే కావాలిగాని, మత గురువులో, ప్రవక్తలో కాదు.  ఇదంతా చేయడానికి, నువ్వు కొత్తగా కష్టపడాల్సిందేమీ లేదు. ఇప్పుడు వ్రాసేదే వ్రాయి. కానీ నెగటివ్ గా కాదు, పాజిటివ్ గా.” అంతా విన్నాక, శరత్ అలోచించాడు. తల పగిలిపోయేలా అలోచించి నవ్వుకున్నాడు. అతన్ని చూసి చెప్పింది మాలిని. “ఇదంతా మాకు తెలీనట్టు, మేం అలోచించనట్టు చెబుతుంది అని నవ్వుకోకు శరత్”  అద్దిరిపడ్డాడు శరత్. ఆ క్షణం నిజంగా అలాగే అనుకున్నాడు.”నేను చెప్పేది సులభం కాదు, కానీ కష్టమూ కాదు. కష్టపడే ధైర్యం లేక అందరి దారిలో నువ్వూ నడుస్తున్నావు. కానీ కొత్త దారిని కనిపెట్టేది ఎవరో ఒకరే. మిగతా అంతా దాన్ని ఫాలో అవుతారు. నువ్వు వెనకే వుండాలనుకుంటున్నావో, ముందుకొస్తావో నీ యిష్టం. వెళ్తా మరి” అంటూ లేచింది మాలిని. 

తుఫానులా వచ్చి వెళ్ళిపోతుంది. ఎందుకొచ్చిందో, ఎందుకెళ్తుందో అర్ధం కాలేదు. “నేను నిజంగా నీకు నా బాధ చెప్పు కోవడానికి వచ్చానే  కానీ నీ వల్ల కాదని తెలిసిపోయింది. అందుకే వెళ్తున్నాను.” మళ్ళీ తెల్లబోయాడు శరత్. తన మనసులో అనుకున్నవన్నీ బయటకి చదువుతుంది ఈ రోజు. మైకంలో తను అన్నీ బయటకే అనట్లేదు  కదా అన్న సందేహం కూడా వచ్చింది. ఇంతలో తను వెళ్తాను అని వెళ్లిపోయింది. తనని ఎల వెళ్తావు అని అడిగే ధైర్యం కూడా చేయలేదు శరత్. డోర్ వేసి వచ్చి, ఆ నిజాల్ని జీర్నించుకోలేక స్ప్రుహ కోలొయేవరకు తాగాడు ఆ రాత్రి.

తెల్లవారుఝామానే ఫోన్ ఆగకుండా మోగుతుంటే లేచాడు శరత్. తల పట్టేసింది. ఫోన్ చేసింది ఏడుకొండలు. అతను చెప్పిన విషయం విన్న తర్వాత పూర్తిగా మత్తు వదిలింది శరత్ కి.

“మాలిని చనిపోయింది”

కలో, నిజమో అర్ధం కాని పరిస్తితులలో అప్రయత్నంగా అడిగాడు “ఎప్పుడు? ఎలా?” అని. 

“నిన్న సాయంత్రం!!! క్లైమాక్స్ షూటింగ్ లో కొండ చివర మీది నుంచి పడిపోయింది. ఏం జరిగిందో తెలీదు. కావాలనే దూకిందని కొందరు, కాదు ఏక్సిడెంటల్ అని కొందరు అంటున్నారు. వెంటనే హాస్పటల్ కి తీసుకెళ్ళారు. రాత్రి ఏడున్నరకి చనిపోయింది” వింటున్న శరత్ ఉలిక్కిపడ్డాదు. సరిగ్గా ఆ ప్రాంతంలోనే  తన దగ్గరికి వచ్చింది మాలిని.

“మీరు చెప్పేది నాకర్ధం కావట్లేదు” గొంతు తడారిపోతుంటే అన్నాడు. శరత్.

“నేను చెప్తుంది నిజం. నాకు ఎనిమిదింటికి తెలిసింది. అప్పటినుంచి  నీకు ట్రై చేస్తుంటే., నీ మొబైల్ స్విచాఫ్ అని వచ్చింది” వెంటనే మొబైల్ చూస్కున్నాడు శరత్. బాగానే వుంది. ఏడుకొండలు ఫోన్లో ఇంక చెప్తున్నాడు ” లాండ్ లైన్ కి చేస్తే,  రింగవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చెయ్యట్లేదు. ఫోన్ డెడ్ అయ్యిందనుకుంటాను” అంటూ ఇంకా ఏదో చెప్తున్నాడు ఏడుకొండలు. కానీ శరత్ కి ఏమీ వినపడట్లేదు. అప్పటికే మందు లేకుండానే, మరోసారి స్ప్రుహ కోల్పోయ్యాడు.

నవనీతం….. (ఒక మంచి వెన్నెలాంటి కథ ;) ) బుధవారం, జూలై 28 2010 

నమస్కారం…. ఇది నా మొట్ట మొదటి కథ…

అక్షరానికో లక్ష తప్పులు వెతికి తిట్టినా… నాకేం ఫర్వాలేదు… ఎందుకంటే, నేను అస్సలు పట్టించుకోను… 🙂

ఎందుకంటే… మళ్ళీ మొదటి లైన్ చదవండి… అందుకు…

ఇక పోతే కథలోకి… భయపడొద్దు… చిన్న కథే…

———-

వడివడిగా అడుగులు వేస్తూ సాగిపోతున్నాడు గోపయ్య. ఆకాశాన్ని చూస్తుంటే అప్పుడో, ఇప్పుడో కుంభవ్రుష్టి అన్నట్టుంది. వర్షాకాలం అయిపోతున్నా వర్షాలు పడుతూనే వునాయి. ఒక రోజు తెరిపిచ్చింది కదా అని బయల్దేరాడు. మళ్ళీ అంతలోనే మబ్బులు. కావిడి బుజం మార్చుకొని తిరిగి నడక ప్రాంభించాడు. ఇంతకు ముందటి వర్షాలకి చిత్తడిగా మారిన నేలలో అడుగులు జారుతున్నాయి, అయినా నడక వేగం తగ్గించలేదు.
ఏదో గ్రామంలో అడుగు పెడుతూనే ఏనుగులు తొండాల్తో పోసినట్టుగా వర్షం పడసాగింది. ఇక ప్రయాణం సాగదని ఒక ఇంటి వాకిలిలోకి వచ్చాడు. అరుగు మీద విశ్రాంతి తీసుకుంటున్న ఆ ఇంటి యజమాని గోపయ్యను లోపలికి ఆహ్వానించాడు. కావిడిని అరుగు మీద పెట్టాడు గోపయ్య. కావిళ్లలోంచి కమ్మటి నేతి వాసన అక్కడంతా పరుచుకుంది. ఇంటి యజమాని ఆ వాసనని ఆస్వాదిస్తుంటే కొంచం గర్వంగా చెప్పాడు గోపయ్య “అది మా తెల్లావు నెయ్యి లెండి”.
“మీదే గ్రామం?” అని యజమాని అడిగితే,
“గోకులం” అలాగే చెప్పాడు గోపయ్య.
ఊరి పేరు చెప్పగానే ఆ యజమాని ముందు ఖంగారు పడ్డాడు, తర్వాత హడావిడి చేసాడు, చివరకు ఆనందపడ్డాడు. “ముందు చెప్పలేదేమండీ ఈ మాట” అంటూ గోపయ్యని ఆసనం మీద కూర్చోబెట్టి తర్వాత ఏ కార్యం మీద బయల్దేరాడో కనుక్కున్నాడు.న్ “ప్రతీ యేడు, నేను కాచిన మా తెల్లావు నెయ్యిని క్రిష్ణుడికిస్తాను. అంతకు ముందు యేడు కావడి సిద్దం చేసి బయల్దేరబోతుంటే ముసలిదయిన అమ్మ కైలాసం చేరింది. పోయినేడు అలాగే మా అయ్య కూడా అమ్మ దగ్గరికి వెళ్ళాడు.దురద్రుష్టం కొద్దీ రెండేళ్ళుగా క్రిష్ణుడి దర్శనం కాలేదు. మొన్న ఆయనే కబురంపాడు, ఈసారి ఏం జరిగినా క్రిష్ణుడికి ఈ చిన్న ప్రసాదం ఇవ్వాల్సిందే” అన్నాడు గోపయ్య.
ఆ మాటకి అబ్బురపడ్తూ అన్నాడు యజమాని “మీరిలాగే వెళ్తే మరో జాము పడుతుంది ద్వారక చెరేసరికి.. మీకభ్యంతరం లేకపోతే ఈ రాత్రికిక్కడే విశ్రమించి రెపుదయాన్నే బయల్దేరవచ్చు”.
“లేదు.. లేదు!!! రాత్రయినా నేను అక్కడికి చేరుకోవాలి, నేను బయల్దేరుతాను” అన్నాడు గోపయ్య.
వద్దు వద్దంటున్నా వినకుండా అతన్ని భోజనానికి బలవంతం చేశారు. వారి మర్యాద చూసి ఆగిపోయాడు గోపయ్య.
ఇప్పుడు కడుపులో ఎత్తుగా వుంటేనే అక్కడికి సరీగ్గా చేరుకోగలడు అనుకొని, కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు గోపయ్య. ఇంటావిడ వచ్చి అరటి ఆకులు పరిచింది. తోటలోంచి తెచ్చి వండిన కూరగాయలతో వడ్డించింది. పప్పు లోకి నెయ్యి… వాసన చూసాడు, అంతగా నచ్చలేదు. “శ్రేష్టమైన తన తెల్లావు నెయ్యి ముందు ఏదైయినా దిగదుడుపే” మనసులోనే అనుకున్నాడు. త్రుప్తిగా భొజనం చేసాక తాంబూలం చేసుకొని వసారా లోని మంచం మీద కూర్చున్నారు యజమానీ, తనూ. వర్షం అప్పుడే వెలసింది.
అడగాలా ? వద్దా? అని సన్శయిస్తూ అడిగాడు ఆ యింటి యజమాని ” మీ నేతి సువాసన మాకు చాలా నచ్చింది. మీరు తప్పుగా భావించకుండ మాకు ఒక వీశెడు ఇవ్వగలరా?”
“క్షమంచాలి! మీకు కావాలంటే మరొసారి తెచ్చిస్తాను, కానీ ఇదివ్వలేను. మరోలా అనుకోవద్దు” అని సున్నితంగా కాదని, వారి వద్ద సెలవు తీసుకొని బయల్దేరాడు గోపయ్య.
సాయంత్రం వరకు, ఆగకుండా ప్రయాణించి ద్వారక పొలిమేరల్లోకి వచ్చాడు గోపయ్య. వర్షం మళ్లీ మొదలయ్యింది. అక్కడే ఒక చెట్టు కింద ఆగాడు. అక్కడికి కొద్ది ద్దురంలో కొంత మంది నిలుచున్నారు. వారిని చూసాక అర్ధమయ్యింది అది ఒక స్మశానమని. నిప్పుని పట్టుకున్న వ్యక్తి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. పాడె మీద ఒక ముసాలావిడ శవం వుంది. బహుశా అతడి తల్లి అయివుంటుంది.. గోపయ్యకి అప్రయత్నంగా తన తల్లి గుర్తొచ్చింది. పాడె మీదినుంచి దించి ఆమె శవాన్ని చితి మీదకి చేర్చారు.
వర్షం కొద్దిగా తగ్గేసరికి కావిడి తీసుకొని బయల్దేరాడు గోపయ్య. కొద్ది దూరం వచ్చేసరికి వర్షం మళ్ళీ పెరిగింది. విసుక్కుంటూ ఒక చెట్టు కిందకి చేరాడు గోపయ్య. కొంచం సేపటి తర్వాత ఇద్దరు వ్యక్తులు స్మశానం వైపు నుంచి పరిగెత్తుకు వస్తున్నారు. ఒక వ్యక్తి ఇంకా ఏడుపుని ఆపుకోలేకపోతున్నాడు. వారిని ఆపి అడిగాడు గోపయ్య “ఏం జరిగింది?”
అతను ఏడుస్తూనే చెప్పాడు ” మా నాన్నమ్మ చనిపోయింది.శవాన్ని దహనం చేస్తుండగా, ఈ పాడు వర్షం తగులుకుంది. ఒక వైపు చీకటి పడుతుంది. కాలుతున్న కట్టెలు ఆరిపోతున్నాయి. మా వెంట తెచ్చిన తైలం అయిపోయింది. ఊళ్ళోకి వెళ్ళి రావాలంటే సమయం లేదు. చివరి ఖర్మని కూడా సరీగ్గా చేయలేని స్థితిలో వున్నాం” అంటూనే భళ్ళున ఏడ్చేశాడు.
గోపయ్య ఒక్క క్షణం అలోచించాడు, కానీ ఇదొక సంకటంలా అనిపించింది. చూస్తూ, చూస్తూ ఒక అవసరాన్ని కాదనలేడు. మరొకవైపు తను పూజించే క్రిష్ణున్ని చూడకుండా వెళ్ళలేడు. ఏ చేయాలో అర్థం కాలేదు. ఇంతలో వారిలో ఒకతను గోపయ్య చేతిలోని కావిడిని చూశాడు. అందులో వున్నదేంటొ అర్ధమయ్యింది. అంతే, గోపయ్య కాళ్ళ మీద పడ్డాడు. “అయ్యా, మీరెవరో గానీ సమయానికి వచ్చారు. ఈ నెయ్యి మాకివ్వండి. మీరడిగిన రొఖ్ఖం ఇస్తాము. దయచేసి, ఒక ప్రాణి అంతిమ యాత్రని పరిపూర్ణం చేసి మా బాధని తొలిగించండి” అని దీనంగా ఏడుస్తూ వేడుకున్నాడు.
గోపయ్యకి తన తల్లి అంతిమ యాత్రే గుర్తుకొచ్చింది. పదమంటూ కావడి తెస్సుకొని బయల్దేరాడు. కొందరు హడావిడిగా చితి చుట్టూ తిరుగుతూ మంట ఆరకుండా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు చేయ్డానికేమీ లేద్న్నట్టు చూస్తూ నిలుచున్నారు. ఇవన్నీ చూస్తూ ఆ తల్లి కొడుకు పూర్తిగా నిర్లిప్తతలో వున్నాడు.
కావిడితో వస్తున్న వారిని చూడగానే కొందరు అత్రంగా ముందుకెళ్ళారు. గోపయ్యతో వచ్చిన యువకుడు వారికి ఏదో చెప్తున్నాడు. గోపయ్య నేతితో వున్న కుండని తీసుకొని ఆరిపోవడానికి సిద్దంగా వున్న కర్రలపై కొంచం కొంచంగా పోసాడు. ఒక్క సారిగా భగ్గున మంటలు లేచాయి. ఇంతలో మరో కడవలోని నేతిని కూడా ఎవరో తెచ్చి పొసారు. ఆరిపోయిన కర్రలు తిరిగి అంటుకున్నాయి. ఇక ఎవ్వరు ఆపినా ఆగేది లేదన్నట్టు మండుతున్నాయి.
వర్షం సన్నగా పడుతున్నా వెచ్చగా మంట సెగ తగులుతుంది.
తిరిగి చూసేసరికి అంతా తననే చూస్తున్నారు. అందరికీ తెలిసినట్టుంది. అతను వచ్చి గోపయ్య చేతులను క్రుతఘ్ఞతతో పట్టుకున్నాడు. కపాల మోక్షం తర్వాత అందరూ తిరిగి బయల్దేరారు.
ఆ రోజేం చేయాలో అర్ధం కాలేదు గోపయ్యకి. సహాయం అయితే చేశాడు కానీ క్రిష్నయ్యకు మొహం ఎలా చూపించాలో తెలీలేదు. తను చేసింది మంచిపని. ఆ పని చేసినందుకు తనకి ఏ మాత్రం బాధ లేదు. కానీ క్రిష్నునికి ఏం చెప్పాలి? చివరికి ఏం చెప్పకుండా తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకొని ప్రయాణమయ్యాడు. కానీ వారు వదల్లేదు. బలవంత పెట్టినా డబ్బులు తీసుకోక ఆతిథ్యం మాత్రం స్వీకరించి బయల్దేరాడు.
మరుసటి సాయంత్రం గోధూలి వేళకు ఊరు చేరుకున్నాడు.. సరాసరి వాగులోకి వెళ్ళి స్నానం చేసి తర్వాత ఇంటి దారి పట్టాడు. మేత నుంచి అప్పుడే వచ్చిన ఆవుల్ని చావిట్లో కట్టేస్తోంది సరయు. క్రిష్ణునికి ఇష్టమని తన కూతురికి ఆ నది పేరు పెట్టుకున్నాడు.దూరం నుంచే గోపయ్యని చూసి కట్టేయబోతున్న లేగని వదిలేసి పరిగెత్తుకెళ్ళింది. లేగ దూడ సంతోషంగా ఆవు దగ్గరికి పరిగెత్తింది.
గోపయ్యకి పరుగెత్తుతూ ఎదురు వెళ్ళి అడిగింది సరయు” క్రిష్ణుడు కలిశాడా నాన్నా?”
“లేదురా…” అంటూ బాధగా ఏదో చెప్పబోయాడు గోపయ్య. “నిన్నే బయల్దేరాడే, దార్లో కలువలేదా?” అంది.
గోపయ్యకి అర్ధం కాక ఏంటని అడిగాడు. తండ్రి ఎత్తుకోగానే చెప్పింది “నిన్న సాయంకాలం మనింటికొచ్చాడు, అమ్మ ఇంట్లో లేదు. నీ గురించి అడిగాడు, నువ్వు అక్కడికి రాలేదని తనే వచ్చాడట. అడిగితే అన్నం పెట్టాను. నువ్వు నా కోసం దాచిన తెల్లావు నెయ్యిని అడిగి మరీ వేయించుకున్నాడు” అంటూ ఇంకా ఏదో చెప్తూ వుంది. గోపయ్యకి కొద్ది కొద్దిగా అర్దమవసాగింది. సరయుని కిందకి దింపి ద్వారక వైపు తిరిగి చెస్తులెత్తి “నేనేం చేసినా నీకు, అది నేను చేసిందే అనుకోవటం నాదే తప్పు” అనుకున్నాడు.
“నాన్నా, నాన్న, క్రిష్ణుడెంత మంచివాడో… నాకోసం పిల్లంగోవి వినిపించాడు. నా పేరడిగి నన్నెత్తుకున్నాడు.ఇదిగో… ఇక్కడ ముద్దు కూడా పెట్టుకున్నాదు” అంటూ బుగ్గను చూపించింది.

అంతవరకు మనస్సులో వున్న ఒక వెలితిని సరయు ఆనందంతో నింపేసింది. సంతోషంగా ఎత్తుకొని ఆ చిన్ని బుగ్గల మీద చిన్నగా ముద్దు పెట్టాడు.
….
🙂 😉 🙂

ఒక రోజెల్లి పోయింది మంగళవారం, జన 26 2010 

“ఒక రోజెల్లి పోయింది, వెళ్ళిపోయిన రోజు గురించి అలోచిస్తుంటే, ఈ రోజూ వెళ్ళిపోతుంది” ఇలా మొదలయిన ఆ కథ ప్రతీ రోజూ జ్ఞాపకానికి వస్తుంది. అమరావతి కథలు మొత్తం ఒక ఎత్తయితే, ఇదీ, మరో రెండు మూడు కథలు కలిపి మరో ఎత్తు. చదవగానే హత్తుకొని, కొన్ని రోజులు/నెలలు/సంవస్త్రాలు గుర్తుండిపోయే కథలు చాలా తక్కువ. అలాంటి వాటిల్లో ఇదొకటి. ఈ కథ ఎందుకు నచ్చిందా అని అలోచించలేదు. ఎందుకంటే, అలోచిస్తే, ఖచ్చితంగా ఒక్క కారణం మాత్రమే వుండదు. ఈ కథని, ముక్యంగా ఇందులోని థీం ని ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న చాలా ప్రాబ్లంస్ కి రిలేట్ చేసుకోవచ్చనుకుంటాను. నిలబడి మినరల్ వాటర్ తాగటం కంటే, పరిగెత్తీ, పరిగెత్తీ బూస్ట్ తాగితే గానీ సంతొషించని మనకి, పిచ్చయ్యగారి జీవితం ఒక ఓటమిలాగా అనిపించొచ్చు. నాకూ మోదట అలాగే అనిపించింది. కానీ అలోచిస్తే, మనకి ఒక పరుగు కావాలి, గెలుపు కావాలి లేదా ఓడిపోవాలి… మళ్ళీ పరిగెత్తాలి. సెలబ్రేషన్ కి ఒక అకేషన్ కావాలి (గెలుపో, ఓటమో), డిస్కషన్ కి ఒక టాపిక్ కావాలి. ప్రతీ విషయంలో కాంపిటీషన్, స్టాటిస్టిక్సు, సర్వే లు .. ఇంతే… ఇలా చూస్తే, పిచ్చయ్య గారు గెలవలేదు, కానీ ఓడిపోలేదేమో కూడా. ఖచ్చితంగా వాటికతీతంగా మాత్రం బతికారు. పరిగెత్తేవాళ్ళనీ, గెలిచేవాళ్ళనీ, ఓడిపొయేవాళ్ళనీ, చూస్తూ వినోదంగా గడిపారనిపిస్తుంది. ఎక్కడో చలం అన్నట్టు “జీవితాన్ని, బయటినుంచి ఒక ప్రేక్షకుడిలా చూస్తే బావుంటుందని…”, అలా గడిపాడేమో జీవితాన్ని. ఇంకా ఈ కథ గురించి ఎన్నో అనుకున్నను. అన్నీ వ్రాయలకున్నాను. కానీ చెప్పుకోవాల్సిందింతే అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ రాస్తే, మ్యాటర్ డైల్యూట్ అవుతుందేమోనని భయం. అయినా, రెండు పేజీల కథకి నాలుగు పేజీల టపా రాస్తే, చిరాగ్గా వుండదూ.. అర్థం చేసుకునేవాడి అద్రుష్టం అన్నట్టు ఆయనేమో రెండు, మూడు పేజీలే వ్రాశారు. ఇంతకూ, ఇప్పటివరకూ మరెవ్వరూ ఆ పుస్తకం మీద నాలుగు వాల్యూం ల థీసిస్ రాయలేదేమో పీహెచ్ డీ కోసం 😉 నాలుగు పుస్తకాలంత పాత్రల విశ్లేషణ బదులు, నలబై పేజీల కథ చదివి అర్థం చేసుకుంటే చాలదూ… చాలదనే అనుకుంటారు చాలా మంది… 🙂