ఆవకాయ తో అన్నం తిన్న తర్వాత, ఆపిల్ పై ని డెసర్ట్ గా తిన్నట్టయ్యింది నా పరిస్తితి ఈ వారం. పూర్తిగా వైరుధ్యమైన రెండు గొప్ప రుచులని అనుభవించానని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశ్యం.

రెండు మంచి పుస్తకాలు వెంట వెంటనే చదివిన అనుభవాలు ఇంతకు ముందే వున్నా, ఈసారి కలిగిన అనుభవం మాత్రం గిలిగింతలు పెట్టింది, ఎంత యాదృచ్చికంగా జరిగినా.

ఒక కథ నిజం, మరోటి కల్పితం, ఒక కథ దళితుల గాథ, మరొకటి బ్రాహ్మణ ఘోష, వైరుధ్యాలతో పాటు ఎన్నో సామీప్యతలు. రెండు కథలూ మూడు తరాల చరిత్రలు. రెండింటిలోను వలస యాత్రలు. ఆచారం ఎక్కువై చదువుకి అడ్డంకులు ఒకరు ఎదుర్కొంటే, ఆచారం తక్కువవ్వటం వల్ల చదువుకోవటం కష్టమైన వారు మరొకరు. ఏదేమైనా రెండూ కదిలించే కథలు. ఏక బిగిన చదివించే బిగువూ, చదివిన తర్వాత మనసులో గూడు కట్టుకొని కొన్ని రోజులపాటు వెంటాడే శైలీ ఈ రెండు పుస్తకాల సొంతం.

 

విషయం లోకి వస్తే, నేను చదివిన మొదటి పుస్తకం, ‘నా పేరు బాలయ్య’, రచయిత వై. బి. సత్యనారాయణ గారు.

ఇది నిజ జీవిత చరిత్ర. మూడు తరాల వీరి వంశ చరిత్ర. దళితులుగా పుట్టి, దొరల కోసం బతుకుతున్న జీవితంలో, ఒక తరం వేసిన మొదటి అడుగు తర్వాతి రెండు తరాల్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో, చదువు ఎంత ముఖ్యమో, ఏమీ లేని బ్రతుకులలో చదువు ఎంత మార్పు తేగలదో ఈ పుస్తకం వివరిస్తుంది. దీనికి సజీవ సాక్ష్యాలుగా వారి జీవితాలే మనకు  కనిపిస్తాయి. ఈ పుస్తకం 2011 లోనే ప్రచురించబడినా,  మొదటి సారి ఈ పుస్తకం గురించి, ‘కబాలి ‘ సినీమా ద్వారానే తెలిసింది. తర్వాత కొన్ని రోజులకి ఈ పుస్తకం కొన్నాను, కానీ మొన్నటి వరకూ చదివే ధైర్యం చేయలేదు. కారణం ముందే ఏర్పరుచుకున్న ఒక అపోహ వల్ల, అంటే దళిత సమస్య అనగానే, చాలా విషాదభరితమైన కథ కావచ్చు,  భీభత్స వర్ణనతో నిండి దయా రసంతో ముగుస్తుందేమో, అలా అనిపించి, దీన్ని చదవటం ఆలస్యమైంది. కానీ చదవటం మొదలుపెట్టాక, ఒక స్వీట్ సర్ప్రైజ్.  చాలా ఆహ్లాదంగా సాగింది. వారు ఎదుర్కొన్న కష్టాల వేడిని, మనకి చలువ కళ్ళద్దాలు తొడిగి చూపెట్టినా, అంతర్లీనంగా, మనకి ఆ సెగ తగులుతూనే వుంటుంది. నా దృక్పధాన్ని విశాలం చేసుకోవడానికి దొరికిన ఒక అవకాశంలా అనిపించింది.

మొదట ఈ పుస్తకం ఇంగ్లీషులో విడుదలయ్యింది. తర్వాత తెలుగులోకి అనువదించబడింది. ఈ పుస్తకాన్ని రచయిత మాతృ భాష తెలుగులో కాకుండా ఇంగ్లీషు లో వ్రాయడానికి కారణం, చదువు యొక్క గొప్పతనం చెప్పడం కోసమే. ఇంగ్లీషు చదివితేనే గొప్ప అని కాదు, కానీ నేటి సమాజంలో విద్యాభివృద్దికి, ఇంగ్లీషు కూడా ఒక సూచనే. ముందు తరం వరకు పాఠశాల విద్య ఎరుగని ఒక కుటుంబం నుంచి ముగ్గురు డాక్టరేట్లు రావడం చిన్న విషయం కాదు.

తెలుగు అనువాదం కూడా చాలా సహజంగా వుంది. మొదటి సారి తెలుగులోనే ఈ పుస్తకం చదివేవారికి, ఇది ఒక అనువాదం అన్న విషయం అస్సలు తెలీనంత బాగా వ్రాసారు.

ఇక రెండవ పుస్తకం ‘సాయంకాలమైంది’, రచయిత గొల్లపూడి మారుతీ రావు గారు.

కథ విషయానికొస్తే, మూడు తరాల ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబ కథ. ఒక అస్పృశ్యుడిని చూసినందుకే వూరు వదిలేసిన తాత నుంచి, సప్త సముద్రాలు దాటి అమెరికా వరకూ వెళ్ళిన మనవడి వరకూ జరిగిన మార్పుల కథ. ఈ పుస్తకం మీద వున్న ఒక ముఖ్యమైన విమర్శ, బ్రాహ్మణిజాన్ని ఎక్కువగా చూపెట్టడం. సనాతన ఆచారాలని విపరీతంగా మెచ్చుకోవటం, అప్పటి కుల వ్యవస్తలో ఏ లోపాలూ లేవన్నట్టు చిత్రీకరించడం ఇలాంటివి, దీన్ని ఒక బాలెన్స్ డ్ రచనగా లేదు అనటం. అది కొంతవరకూ నిజమే అనిపిస్తుంది.

కానీ, ఈ నవల యొక్క ఆయువు పట్టు దీని శైలి. ఇదే నేను చదివిన మొదటి గొల్లపూడి వారి రచన. వారి శైలి అన్ని పుస్తకాల్లోను ఇలానే వుందా, లేక ఈ పుస్తకంలో మాత్రమేనా అనేది, ఇంకా కొన్ని రచనలు చదివి తెలుసుకోవాలి. కానీ ఈ పుస్తకం లో మాత్రం, వారి శైలి అద్బుతం. కాకపోతే వారి శైలి మీద నేను చదివిన మరొక విమర్శ ఏమిటంటే, పాత్రల ద్వారా చెప్పించకుండా వారే దూరి ఎక్కువగా చెప్పారు అన్నది. కానీ ఈ విమర్శ అర్థ రహితం. ఒక రచనని తను చెప్పాలా, తన పాత్రల ద్వారా చెప్పించాలా అన్నది రచయిత ఇష్టం. ఆ విధానం మనకి నచ్చడం, నచ్చకపోవడం వేరే సంగతి. కానీ, వారు ఎలా రాయాలన్నది కూడా మనమే చెప్తే ఇక ఆ రచయిత ఎందుకు?

మరొక ముఖ్యమైన చర్చ, ఈ నవల యొక్క ప్రయోజనం ఏమిటి అని? అసలు ఈ రచన ద్వారా వారు ఏం చెప్పదలుచుకున్నారు అని. నిజమే, ఇది అవసరమైన చర్చే. కానీ, అసలు ఏ ప్రయోజనం ఆశించి ఒక పని చేయాలి? ముఖ్యంగా కళకు ప్రయోజనం ఏమిటి? మనస్సుని రంజింపచేయటమా? లేక సమాజాన్ని ఉద్దరించటమా?

కోడి ముందా? గుడ్డు ముందా? లాంటి  ప్రశ్న ఇది. దీనికి జవాబు, ఎవరి మనసులో వారికి దొరుకుతుంది. దాన్నే మనం వారి అభిప్రాయం అంటాం. మీ అభిప్రాయం ప్రకారం, ఈ రచన మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు.

కానీ గొప్ప కళ యొక్క, ఒక ముఖ్య లక్షణం, వెంటాడటం. మనం అ కళ ని అనిభవించిన తర్వాత కూడా ఆ అనుభూతి మనల్ని వదలకపోవటం. ఆ అనుభూతి ఏదైనా కావచ్చు, భయం, బాధ, ఆనందం, విషాదం, ఏ అనుభూతైనా, ఆ అనుభవం తర్వాత కూడా మనల్ని వెంటాడితే ఖచ్చితంగా అది గొప్ప అనుభవం. మంచైనా, చెడైనా, ఏదైనా సరే. అలా చూస్తే, ఈ పుస్తకం కూడా గొప్ప రచన. చదివిన తర్వాత కూడా ఆ అనుభూతి మనల్ని వదలదు.

ఒకేసారి రెండు విభిన్న ద్వారాలు నా ముందు తెరుచుకున్నట్టనిపించింది, ఈ రెండు పుస్తకాలు చదవగానే. ఏది గొప్ప, ఏది తక్కువ అన్న ప్రసక్తే లేదు. చదువుతున్నంత సేపూ ఊపేసిన రచనలు.

చదివిన తర్వాత ఇంకా చాలా కాలం గుర్తుండిపోయే రెండు పుస్తకాలు ఇవి.