అమ్మాయిగారూ… అమ్మాయిగారూ,

పొద్దుట్నుంచి బువ్వ తినలేదు కదండీ??

అమ్మాయిగారూ… మడిసికి మనేద మంచిది కాదండీ…     మనేద పెట్టుకొని ఏడిస్తే మన కన్నీళ్లే కరుసైపోతాయి, ఏదీ ఆ పాదం సూపండి…

అసలండీ… దేవుడు మనకు కనీళ్లిచ్చింది మనకోసం కాదంటంది, ఎదటోళ్ళకి  బాదోచ్చినప్పుడు మనం కన్నీళ్లు పెట్టాలట… అందుకు… అప్పుడు ఆళ్ళకి దైర్ణం వత్తాది…

నిజమండీ… దొర గారు సెప్పారు. మనకి కట్టవత్తే నవ్వాలటండీ, కాల్లో ముల్లు గుచ్చుకుందనుకోండి, ఏడవకూడదండీ, కంట్లో గుచ్చుకోలేదు గదాని నవ్వాలటండీ… హెహెహె…

ఒక్కథ చెప్పనాన్డి? అనగనగనగా ఓ రాజు గారు, ఆలు ఓడికి ఉరి సిచ్చేసినారు, ఆడు పకపకమని నవ్వాడంటండీ … దానికి రాజు గారు, ‘ఏరా, ఎంటా నవ్వు? ఇప్పుడే సంపేత్తాను’  అన్నారంటండీ. దానికి ఆడు, ‘ఓ రాజా, నాకు ‘రెక్కల గుర్రం’ విద్య తెలుసు, నన్ను గానీ రేపు సంపేశారనుకోండి, ఆ ఇద్య జూసే అదృష్టం మీకెక్కడిదిరా ఎర్రి మొహమా’ అన్నాడటండీ.

‘మరైతే  గుర్రాన్నెగిరించు’ అన్నారు రాజుగారు.

‘నిజంగా ఎగిరించాడా’???

‘ఆస గదే, ఆర్నెల్లు పట్టుద్ది. నాకు గుర్రానికి తిండీ, దాణా, మందులు, మాకులూ కావాలి’ అన్నాడు.

రాజుగారు ‘సరే’ అన్నారు.

రోజూ ఆరంపించే పాలూ, మీగడా, ముప్పాతిక తను తిని, ఆ మిగిలినదాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరిగిపోతుంది వాడికి. ఖైదు లో పక్కనున్నోడు ‘ఏరా, గుర్రం నిజంగా ఎగురుద్దా?’ అన్నాడు.

దానికి వీడు నవ్వేసి, ‘ఉత్తినే, కథ అల్లాను లే’ అన్నాడు.

‘మరైతే అబద్దం చెప్పి లాభమేముందిరా’ అన్నాడు.

‘హి హి హ హ , ఉరి సిచ్చ ఆరు నెల్లు వాయిదా పడింది కదా, ఈ లోగా ఎన్నో జరగొచ్చు,

రాజు గారు మనసు మార్చుకొని నా సిచ్చ రద్దు చేయొచ్చు, రాజు గారే సచ్చిపోవచ్చు, భూకంపం వచ్చి జైలు కూలి పోవచ్చు, సివారాఖరికి, ‘ఏమో, గుర్రం ఎగరావచ్చు’ అన్నాడు.

ఈ ముళ్లపూడి వారి మాటలు అవగానే, వేటూరి వారి పాట…

¯¯¯¯¯¯¯¯¯¯¯¯

కప్పలు అప్పాలయిపోవచ్చు , సున్నం అన్నాలయిపోవచ్చు

నేలను చాపగ చుట్టావచ్చు, నీటితో దీపం పెట్టావచ్చు

ఏమో…. ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

కప్పలు అప్పాలయిపోవచ్చు , సున్నం అన్నాలయిపోవచ్చు

నేలను చాపగ చుట్టావచ్చు, నీటితో దీపం పెట్టావచ్చు

ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఆనాటి నీ తల్లి, ఆకాశ జాబిల్లి

తారలన్నీ నీకు తలంబ్రాలు పోసి,

హరివిల్లు దిగివచ్చి, హరి వంటి పతినిచ్చి వెళ్ళావచ్చు, రోజు మళ్ళా వచ్చు

ఆ మారు తల్లైన, తల్లల్లే తా మారి,

పట్టుచీరలు పెట్టి  పరమన్నాం వడ్డిస్తే,

ఆరారు కాలాల నీ కంటి నీలాలు ఆరా వచ్చు, మనసు తీరావచ్చు

దైవాలు పెట్టేను లగ్గాలు, పెళ్లిళ్ల లోగిళ్లు స్వర్గాలు,

ఆ నింగి, ఈ నేల, పాడాల నీ పాట ఈ పూటా,

పాములు పాలు ఇవ్వావచ్చు, బెబ్బులి పిల్లిగ మారా వచ్చు,

నవ్విన చేను పండా వచ్చు, రోకలి చిగురూ వెయ్యావచ్చు,

ఏమో…. ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఏడింట సూరీడు ఏలుతున్నాడు, రాకుమారుడు నీకు వ్రాసి వున్నాడు,

రతనాల కోటకే రాణి వంటాడు, పగడాల దీవికె దేవి వంటాడు,

గవ్వలు రవ్వలు కానూ వచ్చు, కాకులు హంసలు అయిపోవచ్చు,

రామచిలుక నువ్వు కానూ వచ్చు, రాంబంటు కలా పండావచ్చు,

ఏమో …. ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

కప్పలు అప్పాలయిపోవచ్చు , సున్నం అన్నాలయిపోవచ్చు

నేలను చాపగ చుట్టావచ్చు, నీటితో దీపం పెట్టావచ్చు

ఏమో…

¯¯¯¯¯¯¯¯¯¯¯¯

ఇంకా ఏం కావాలి?

రోకలి చిగురూ వెయ్యావచ్చు… ఒక సామెత… ఆలోచిస్తే… మరణం లోంచి జీవితం…

ఇంతకంటే  గొప్ప ఆశావాదం ఎక్కడుంటుంది…