మొన్నీమధ్య కంపనీలో ఒక మెయిల్ ఫ్లోట్ అయ్యింది. అది 1970, 1980 దశాబ్దాల్లో పుట్టిన వారి బాల్యం ఏ విధంగా గదిచిందో చెప్తూ… అది చదివాక నా కళ్ళ ముందూ చక్రాలు తిరిగి ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళాను.
అప్పటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటె, “వెన్న” లాంటి అనుభూతులు మెత్తగా చుట్టుముట్టాయి.ఈ ఠపా వ్రాయడానికి, మరోసారి సారి చక్రాలు తిప్పితే…..
అది సుధీర్ గాడి “స్వర్ణయుగం” మొదలయిన కొత్తల్లో (అంటే 1989 ప్రాంతంలొ అనుకుంటా), ఓ రాత్రి TV లొ “కిట్టుగాడు” సీరియల్ చూసేసి, అందులో కిట్టు చేసిన అల్లరికి పోటీగా, నేనూ మరో ఇద్దరు స్నేహితులు, వీధిలో వున్న ట్యూబ్ లైట్ వెలుతురులో ఆడుతున్నాం. అప్పట్లో ఆ వీధి అంత రద్దీగా వుండేది కాదు. ఆమ్మవాళ్ళూ ఆంటీవాళ్ళూ వంట ప్రయత్నాల్లో వున్నప్పుడే మా ఆటలు. ఠంచనుగా తొమ్మిది లోపు పిలుపొచ్చేస్తుంది. ఆట వదిలేయాలి. ఆ విషయం బాగా తెలుసు కాబట్టి, కరెంట్ లేకపోయినా, ఆడుతూనే వున్నాం. (అంత ధ్యానంగా ఇప్పుడు ఏ పనీ చెయ్యలేమనుకుంటా). అంతలొ సడన్ గా మా పక్కనుంచి ఎదో వెళ్ళినట్టనిపించింది. తెల్లగా వుంది… ఏంటో అర్ధం కాలేదు. బయంతో ఆగాం… మళ్ళీ ఇటు పరిగెత్తింది. చీకట్లో తెల్లగా కనిపిస్తుందే కానీ అర్ధంకావట్లేదు. ఆట మీది ఉత్సాహం కాస్తా దాని మీదకు మళ్ళింది. రాళ్ళ చాటున్నదేంటో తెలీట్లేదు. అప్పుడే మమ్మల్ని బతికిస్తూ కరెంట్ వచ్చింది.ఇంతలో బాలూ గాడూ (నాకన్నా మూడేళ్ళు చిన్న అనుకుంటా, అందుకే “గాడు”) వాడి నాన్నా, ఇద్దరూ ఎదో వెతుకుతూ వచ్చారు. వాడి నాన్న చేతిలో వున్నదేంటో చుశాక మా ఆశ్చర్యానికి అంతులేదు. అది తెల్ల కుందేలు. జతనుంచి తప్పిపోయిన దానికోసం వెతుకుతో వచ్చారు అంకుల్.ఆ రోజు నుంచీ , (వాడు “బాలూ” బట్ నో “గాడు”) ఎన్నో సాయంత్రాలు ఆ కుందేలుతో ఆడుకున్నాం.. అలాంటి ఆనందాలు నా స్వర్ణ యుగంలో ఇంకా కొన్ని వున్నాయి. అసలు “స్వర్ణయుగంలో సుధీర్ అనుభవించిన సుఖ: దుఖా:లను వివరింపుడు (5 మార్కులు)” అని అడిగితే, స్వర్ణయుగంలో…స్వర్ణయుగంలో…సుధీర్ గాడు…సుధీర్ గాడు…అనుభవించినవన్నీ సుఖాలే….అనుభవించినవన్నీ సుఖాలే అన్న పాఠం వల్లెవేస్తానేమో… అప్పుడు కష్టం అనే పదం తెలీదు. కష్టాలు అనేవి వుంటాయన్న విషయమే ఊహలోఅ లేదు. ఉన్న ఒక్క ఇబ్బందీ స్కూలుకెళ్ళడం,అదీ కష్టం కాలేదు, కాస్తో, కూస్తో చదువుతాం కాబట్టి. సాయంత్రం రాగానే, “విచిత్ర కాశీ మజిలీ కథలు”, “కిట్టుగాడు”, “పరమానందయ్య శిష్యుల కథ”, “రామయణం”, “మహా భారతం” , “విక్రంభేతాల్”, పొట్టి వీరయ్య, అం అః, కం కః అంటూ మాజిక్లు చేసే సీరియల్, చిత్రలహరి, చిత్రహార్, తెలుగు సినిమా, హిందీ సినిమా, తెలుగు వార్తలు, ఉర్దూ వార్తలు, గ్రామదర్శిని, “అలిఫ్ లైలా”, “జెయింట్ రొబోట్”, “స్ట్రీట్ హాక్”, “స్టోన్ బాయ్”, “అమరావతి కథాయే”……ఒక్క దూరదర్శన్ లోనే, నన్ను కదలకుండా కూర్చోపెట్టి రూజుకో అరగంట మరో లోకానికి తీసుకెళ్ళిన సీరియల్సివి. ఇప్పుడు వంద చానల్లలో వెయ్యి ప్రోగ్రాంలు. ఏమో మరి, ఎవరి “స్వర్ణయుగంలో” ఇవి గుర్తులుగా మిగులుతాయో ఇవి… ఆటలు…పాటలు…రోజుకో ఆట, మామయ్య టేప్ రికార్డర్ లో పాట.. నా యుగం… బంగారంతో పనెక్కడ?? ఆనందం ఆర్ణవమైతే, మాకు ఆభరణమైతే… విచిత్ర కాశి మజిలీ కథల్లో వచ్చే కౌబాయ్ మ్యూజిక్ విన్నా, “అన్వేషణ” లోని “కీరవాణీ…” పాటకు ముందు వచ్చే చిన్న బిట్ ని విన్నా, టైం మెషీన్, అవసరం లేకుండా, నన్నెక్కడికో లాక్కుపొయే ఈ మనసుంది చూశారూ… దీనికి ఒక జోహారు. (ప్రస్తుతం ఒకటి నా మొబైల్ రింగ్ టోన్ గా, మరొకటి నా ఎంపీత్రీ ప్లేయర్ లో దాక్కొని వున్నాయి). ఇప్పటికీ నా ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు ఆ రింగ్ టోన్ మోగుతుంటే, కత్ అయ్యేవరకూ లిఫ్ట్ చెయ్యకుండా వినాలనిపిస్తుంది. వాడు తిడుతూనే వుంటాడనుకోండీ, అది అప్రస్తుతం. ఆటలు… ఎన్ని ఆటలు.. ఏమో పేర్లు కూడా గుర్తులేనన్ని ఆటలు. కరెంటు పోతే వెన్నెల్లో, కరెంటుంటే ట్యూబ్ లైట్ వెలుతుర్లో బాణాలుంటే రఘువంశంలో, లేకుంటే కపి వంశంలో, ఆడి…ఆడి అలిసిపోతే… అక్కడే అరుగుమీద శ్యామలక్క వేసిన పొడుపు కథలు, చెప్పిన సంగతులు…ఎన్నో…
క్రికెట్ నాకు పరిచయమవడం నాకు బాగా గుర్తుంది. కొత్త ఆట అని వెళ్ళి, ఒక ఫీల్డర్ లా నిలబడీ, నిలబడీ… విసుగెత్తి…ఆ తర్వాత దాదాపు. రెండేళ్ళు అటువైపే వెళ్ళలేదు. ఇప్పుడు క్రికెట్ పరిచయమా??? హ..హ..హ.. ఊహ తెలిసినప్పటినుంచీ దాదాపు దశాబ్దం గడిపిన ఆ వీధినీ, చొటునీ వదిలి, మరోచోట స్థిరపడ్డాం. అప్పుడప్పుడూ అక్క్డికి వెళ్తూ వుంటాం, అక్కడే స్థిరపడిన ఆంటీ వాళ్ళను కలవడానికి.. వాళ్ళ అభిమానాలు , ఆప్యాతలూ ఏమీ మారలేదు. కానీ గత ఏడెనిమిదేళ్ళుగా ఆ వీధిలోని మా జ్ఞాపక చిహ్నాలన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. మేము పడుకున్న వీధి అరుగు పోయింది. ఆ రేకుల ఇల్లు, చీకట్లో కళ్ళుమూసుకుని ఒక్కసారిగా పరిగిత్తిన ఆ సందూ, చిన్నగా తలూపుతూ మా ఆటలు చుసే మల్లె పందిరి… ఏదీ… ఏవీ లేవిప్పుడు. అందుకే ఆంటివాళ్ళూ, పిల్లలూ ఎంత రమ్మన్నా, అక్కడికి వెళ్ళబుద్దేయట్లేదు. వెళ్తే, రంగు రంగుల జ్ఞాపకాలతో వున్న నా మనసుకి నిన్ననే వేసిన “బాక్టీరియా రెసిస్టెంట్ ఎమల్షన్ పెయింట్” ఎక్కద అంటుతుందోనని భయం. నాకంటూ కొన్ని జ్ఞాపకాలున్నయి… ప్రస్తుతం నేనున్న వేగంలో నావంటూ వున్న ఆ కొన్నీ చెరిగిపోతాయేమో అని భయం…
జీవితాన్ని రివైండ్ చేసే శక్తుంటే, 1987 నుంచి 1992 వరకూ, మళ్ళీ…మళ్ళీ రివైండ్ చేస్తూ కాలంలోకి అద్రుశ్యమవుతాను…..
మరి మీరు…
6 Responses »