…అని అడిగితే, ఏం వద్దు ??? అని మీరు వెటకారంగా అడుగుతారని తెలుసు… కానీ ఏం చేస్తాం… కొన్ని సార్లు తప్పకుండా ఆ ప్రశ్న వేసుకోవాల్సొస్తుంది…
ముఖ్యంగా మనతో పాటే ఇన్నాళ్ళూ పనిచేసిన వ్యక్తి అకస్మాత్తుగా ఏ స్వీడనో లేక సింగపూరో లేక స్విట్జర్లాండో లేక మరో లాండో వెళ్ళిపోతున్నాడని తెలిస్తే… మనకంటే సంపాదన కొన్ని రెట్లు అమాంతంగా పెరిగిందని… మన దగ్గర నెల చివర్లో ఇక చేబదుల్లు తీసుకోడని… కనీసం, మరీ ముఖ్యంగా అప్పుడప్పుడు మనకి చేబదులు ఇవ్వడని తెలిస్తే… కొంచం బాధపడి వూరుకోవచ్చు…
కానీ ఇదే విషయం మన ఇంట్లోనే తెలిస్తే…
వెళ్ళేవాడు ఎందుకెళ్ళాడో తెలుసుకోకుండానే నా చెవుల్లో జోరీగలు మోగిస్తే…

కనీసం అప్పటికోసమైనా, ఆ క్షణానికైనా నాకేం కావాలి అని నన్ను నేను ప్రశ్నించుకోవాలి… తప్పదు…
అలా నన్ను నేను తీవ్రంగా ప్రశ్నించుకుంటే, నాకు కావలిసిన కొన్ని అవసరాలు నాకు అర్థమయ్యాయి… అవి ఏమిటనిన… 

1. ఆరు జీన్సులు (బ్రాండెడ్ వి బ్రాండ్ కోసం కాకపోయినా మన్నిక, సుఖం కోసం)… ఖరీదు – 7500/-
2. 10 టీ-షర్టులు… ( -డు- (అనిన యధావిదిగా అని అర్ధం చేసుకోగలరు))- షుమారు 8000/-
3. 5 ఫార్మల్ ప్యంటులు – షుమారు 8000 /-
4. 10 ఫార్మల్ షర్టులు – షుమారు 10000 /-
5. రెండు జతల క్యజువల్ బూటులు… షుమారు 7000/-
6. ఒక జత ఫార్మల్ బూటులు… షుమారు 2000/-
7. ఒక జత చెప్పులు – షుమారు 1200 /-
8. ఒక జత స్లిప్పర్లు – షుమారు 300/-
9. ఒక లాప్ టాపు – షుమారు 40000/-
10. ఇంతెర్నెట్ కనెక్షను (నెట్ అపరిమితంగా అని ప్రత్యేకంగా చెప్పకర్లేదు తమకు, కానీ వచ్చిన చిక్కంతా దాని పనితీరుతోనే… కాబట్టి… సదా సర్వీసు ప్రొవైడరు వాగ్దానం చేసినంత స్పీడు… అంతకంటే ఎక్కువ కోరుకోవట్లేదు)
11. ఒక ఐ ఫోను. షుమారు – 30000
12. ఒక ఐ ప్యాడు లేదా ఒక ఎం.పీ.త్రీ ప్లేయరు… షుమారు 8000 /-
13. ఒక పేద్ద టీవీ… షుమారు…. 22000/-
14. దానికి కేబులూ… షుమారు 200 /- (నెలకి)
15. ఒక 4.1 / 5.1 చానల్ మ్యూజిక్ సిస్టం… (5000/-)
16. మూడు లేదా నాలుగు… లేకపొతే సరిపడినన్ని పుస్తకాల షెల్ఫులు…
17. వాటినిండా నేను కొనుక్కునే పుస్తకాలు – ధర ఐచ్చికం
18. ఇంకో షెల్ఫు నిండా నేను చూడాల్సిన సినీమాలు, వినాల్సిన పాటలు…ధర ఐచ్చికం

మొత్తం కలిపి 1,49,000/-… సమీప సరి సంఖ్య 1,50,000 /-
అంతే… ఇవి చాలు నిజంగా బోరు లేకుండా జీవితాన్ని అనుభవించాడానికి…

వీటిలో చాలా వరకు లేదా దాదాపుగా అన్నీ సమకూర్చుకుని ఇక చాలు కదా అంటే వినరే… ఇంకా ఏదో కావాలి…

ఫైనాన్షియల్ సెక్యురిటీ కావాలి అని వారి వాదన…

అదీ నిజమేనేమో అనిపించినా , నాకు మాత్రం మరేదో అసంత్రుప్తి..

ఏమై వుంటుందా అని ఆలోచిస్తే, అన్నిటికంటే ఎక్కువగా నాకు దొరకట్లేనిది “సమయం”…

అన్నీ వున్నా అల్లుడి నోట్లో … అన్నట్టు… అన్నీ వున్నా చదవాలనిపించినప్పుడు చదవలేం… వినాలనిపించినప్పుడు వినలేం… నచ్చిన పనికి సమయం కేటాయించలేం… ఆంగ్లములో అనాలంటే ….జాబ్ సక్స్… ఇంకా నయం పశ్చిమాన పుట్టలేదు… అక్కడ ఈ మాటంటే కూడా ఉద్యోగం పీకేస్తారట…


అసలు సంగతేంటంటే… ఇక్కడే వుండి జీవితాన్ని అనుభవించాలీ, విదేశాలకి కేవలం వినోదానికో, విహారానికో వెళ్ళాలి కానీ పొట్టకోసం వెళ్ళను అని నేనంటే… కొంత మంది నవ్వి… నావి చేతకాని మాటలని, మరికొంత మంది కలలకి, కబుర్లకి తక్కువేం లేదనీ అన్నారు…

కాబట్టి నేను పై లెఖ్ఖలు వేసి తేల్చినదేమిటంటే… నేను ఆనందంగా బ్రతకాలంటే కావలిసింది మరీ అంత పెద్ద మొత్తమేమీ కాదు… అలా అని మరీ చిన్న మొత్తమేమీ కాదు…
కాకపోతే… నాకు కావల్సిన టైం ని నేను ఉద్యోగం చేస్తూనే సంపాదిస్తే నేనూ నా చుట్టూ వున్నవాళ్ళూ సంతోషంగా వుంటారు…
కానీ నా స్టయిల్లో బతకాలంటే…ఈ వుద్యోగం మానేసినా…ఇప్పుడొచ్చినంత సంపాదిస్తే…ఎవ్వరికీ ఏ గొడవా వుండదు…
కాబట్టి అలా అలోచిస్తాను అంటే…
దానికీ వెటకారాలు… ఎప్పుడెళ్తున్నావు కన్నం వెయ్యడానికి అని…
ఆశ పడితే..అత్యాశ అంటారు… సంత్రుప్తి పడితే…అల్ప సంతోషీ అంటారు…
ఎవ్వరు ఏమన్నా, ఆర్ జీ వీ స్టైయిల్లో… ‘నా చావు నన్ను చావనివ్వండి’…అంటే సరి…

పీ.ఎస్. : విషయం పెద్దది…కాబట్టి నేను చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పకపోవటం జరిగిందని నా వుద్దేశ్యం… కాబట్టి మరింత లోతైన సమచారం కోసం తర్వాత చూద్దాం…
అప్పటికీ నాలో ఈ వేడి వుంటే ;)