ఒక సీరియస్ పొలిటికల్ సినీమాని, చాలా టైట్ స్క్రీన్ ప్లే లో చూసినంత ఆనందం కలిగింది, ఈ పుస్తకం చదువుతుంటే…

 

నా చిన్నప్పుడు పీ.వీ. గారు మేధావి అనీ, అపర చాణక్యుడు అనీ వింటుండేవాడిని… ఆయన ప్రధాన మంత్రిగా వున్నప్పుడు, రాజకీయాల గురించి అస్సలు తెలుసుకోలేనంత చిన్న వయస్సులో వున్నాను, అది నా దురద్రుష్టం…

 

పీ.వీ. గారిని అభిమానించే వారైనా, విమర్శించే వారైనా, రాజకీయాల్లో తలపండిన వారైనా, అస్సలు రాజకీయాలు తెలీని వారైనా, ఒక్కసారైనా తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.

 

కొన్ని దశాబ్దాల వెనక్కి మనల్ని తీసుకెళ్ళి అప్పటి చరిత్రని కొంచమైనా తెలుసుకునే అవకాశమిచ్చింది ఈ పుస్తకం.

 

ఈ పుస్తకంలోని కొన్ని విశేషాలు (నాకు నచ్చినవి)…

 

1.       ఈ పుస్తకం ఆయన ఆత్మకథ అనుకున్నాను.. కానీ మొదలుపెట్టాక  తెలిసింది. పూర్తిగా ఇది ఆత్మ కథ కాదు అని… ఆనంద్ అనే పాత్ర ద్వారా తన అనుభవాలని మనకు చెప్పారాయన. మొదట్లో కొంచెం నిరాశపడ్డా, ఇందులోనూ ఒక ప్రయోజనం వుందని తర్వాత తెలిసింది… ప్రతీ మనిషిని పేరుతో గుర్తించకుండానే, వారి వారి నైజాల్ని మనకి కళ్ళకు కట్టినట్టు వివరించారు. పుస్తకం చదువుతున్నన్ని రోజులూ, ఏవో సందేహాలు, వాటి జవాబులకోసం వెతకడాలూ.. ఆ ముఖ్యమంత్రి ఎవరు? ఆ ఎమ్మెల్యే ఎవరు? బహుశా ఆ కాంట్రాక్టర్, ఫలాన వ్యక్తేనేమో??? ఇలా… రక రకాలుగా గూగుల్లో వెతికినా, తెలిసిన వారితో చర్చించినా.. కొన్ని ప్రశ్నలకి జవాబులు దొరకలేదు… జవాబులకంటే… ప్రశ్నలే బావున్నాయేమో అని కూడా అనిపించింది…

2.       ఆయన మేధావే… సందేహం లేదు… కానీ మామూలు మనిషి కూడా…

3.       రాజకీయాలు కూడా ఒక వ్రుత్తి, అంతే… మరేమీ కాదు. కొంతమంది…డబ్బు కోసం, కొంత మంది పేరు కోసం, మరి కొందరు అధికారం కోసం, రాజకీయాల్లోకొస్తుంటారు…పోతుంటారు… వీటన్నింటి తో పాటు శాసనాలూ, చట్టాలు… అంతే… సినీమా రంగంలా, వ్యాపారం లా, కార్పొరేట్ సంస్తల్లా రాజకీయం ఒకటి…

4. రాజకీయాల్లో కూడా అనుభవం అవసరం… నిజానికి రాజకీయాల్లోనే అనుభవం అవసరం… చాలా అవసరం… అనుభవం తో పాటు… ఇంకా చాలా కావాలి…

5. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతూనే వుంటాయి… అది ఒక మార్పు… ఏ ఒక్క పార్టీ యో… లేక ఏ ఒక్క రాజకీయ నాయకుడో దేన్నీ మార్చలేడు…వాళ్ళు మార్పు కోసం ప్రయత్నిస్తే వారంలో వస్తుంది… ప్రయత్నించకపోతే ఏడు రోజుల్లో వస్తుంది… అంతే తేడా…

6. మూలక మార్పు ఎందులోనూ వుండదు… ఉపరితల మార్పు మాత్రమే (ఫెరిపెరల్ చేంజ్), రాజకీయాల్లోనూ అంతే… నాటికీ, నేటికీ..

 

పీ.వీ గారి ఆలోచనలు కొన్ని ఆశ్చర్యం కలిగించినా, నాకు మాత్రం భలేగా అనిపించాయి… పుస్తకం లోని ఆ వాక్యాలు యధాతథంగా…

 

* కుల రహిత సమాజం కోసం ఇంటి కప్పు మీద నిలబడి ఘోషించే పెద్దలు, ఆ ఆదర్శాన్ని తాము నిజంగానే విశ్వసించి వుంటే రాజ్యాంగం పీఠికలో ప్రస్తావించి ఊరుకోకుండా ఒకే కులంలో వివాహాన్ని నిషేదిస్తూ చట్టం ఎందుకు చేయలేదు?

* మనిషి ప్రాథమికావసరం సంతోషమేనని నా నమ్మకం. నా జీవనతాత్వికత ననుసరించి, సంతోషంగా జీవించే హక్కు అత్యంత పవిత్రమైన మానవహక్కు గా నేను భావిస్తాను. ఆ హక్కును పక్కకి తప్పించేదేదైనా సరే, అది ఆస్తి కానీ, ఆచారం కానీ, అధికారం కానీ, ప్రతిష్ట కానీ అంతమొందించదగినవే. అప్పుడు ఇదే నా పోరాట పరమార్ధం.

 

పీ.వీ గారి ఆలోచనలే కాక… ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ లో నెహ్రూ గారి వాక్యాలు కొన్ని ఇందులో వున్నయి… అవి ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించాయి…

‘యుద్దాన్ని నేనెంత గర్హిస్తున్నా, భారతదేశం పై జపాన్ దురాక్రమణ జరపగల అవకాశం నన్నే విధంగానూ భయపెట్టడం లేదు. యుద్దం తన బీభత్సాక్రుతిలో దేశం మీద విరుచుకు పడితే బాగుండునని కూడా అంతరాంతరాల్లో నేను కొరుకుంటున్నాను. కోట్లాది ప్రజల ప్రత్యక్షానుభవంలోకి వచ్చి, వారిని బ్రిటిష్ వాళ్ళు రుద్దిన శ్మశాన శాంతి నుంచి ఇవతలకి లాగి నేటి నిష్టుర నిజాల ముందు నిలబెట్టి తమను చుట్టేసిన గతం నుంచి తప్పుకొని ముందుకు సాగడానికీ, క్షుద్రరాజకీయవివాదాలనుంచీ, తమ బుర్రల్లో దట్టించుకున్న క్షణిక సమస్యలను గోరంతలు కొండంతలు చేసుకునే ప్రవ్రుత్తి నుంచి బయటపడడానికి ఓ బ్రహ్మాండమైన కుదుపు ఏదో సంభవించాలని నేను ఆశిస్తున్నాను…

యుద్దాన్ని మనమేమీ కోరుకోవడం లేదు, అయిన అది తలుపు తట్టినప్పుడు జాతి రాటుదేలుతుంది, యుద్దం కలిగించే మహత్తర అనుభవాలనుంచి సరికొత్త జీవితం వికసిస్తుంది. అపార ప్రాణనష్టం సంభవిస్తుంది, నిజమే, కానీ అది అనివార్యం. దీనంగా, హీనంగా జీవించడం కంటే మరణించడమే ఉత్తమం.   మరణం నుంచే కొంగ్రొత్త జీవితం చిగురిస్తుంది. మరణించడమెలాగో తెలియని వ్యక్తులకూ దేశాలకూ జీవించడమెలాగో కూడా తెలియదు. సమాధులు ఉన్నచోటే  పురుత్థానమూ వుంటుంది…’

 

ఇంకా ఇందులో బాగా అసక్తిని రేకెత్తించిన ఘట్టాలు…

 

1. ఒక ప్రాజెక్టు అనుమతి కోసం ముగ్గురు కాంట్రక్టర్లు వేసిన ఎత్తుగడలు,

2. భూ పరిమితుల బిల్లుని శాసన సభలో ఆమోదింపజెయ్యటం…

3. పాకిస్తాను తో యుద్దం, చైనాతో యుద్దాం.

4. ముఖ్యమంత్రిగా ఆనంద్ ని తప్పించటం…

 

సగటు పుస్తక అభిమాని తప్పకుండా చదవాల్సిన  పుస్తకం ఇది. పీ.వీ గారి గురించి ఎవరో చెప్పగా విని, వ్రాయగా చదివి పెంచుకున్న అభిమానం కంటే… ఆయన గురించి ఆయన వ్రాతల్లో చదివి తెలుసుకున్న తర్వాత స్పష్టతతో కూడిన అభిమానతో వచ్చిన గౌరవం బావుంది…

 

రాజకీయాల గురించి, స్వాతంత్ర్యానంతర రాజకీయాలు టెస్ట్ బుక్ లా కాకుండా, హాస్యంతో కూడిన నిష్టుర సత్యంలా కావాలంటే… ఈ పుస్తకం చదవండి… చదివాక పీ.వీ.గారు అర్థమయితే అది బోనస్…