నిద్ర లేచి వారమైనా ఇంకా ఈ కల (లేక నిజమా???) నన్ను వెంటాడుతూనే వుంది… ఇప్పుడు నేనూ ఒక ‘టోటెం’ కి ఆర్డరివ్వాలనుకుంటున్నాను…
ఎందుకంటే… అసలు నేను ఈ సినీమా చూశానా? లేక కలగన్నానా? కలలో ఈ సినీమా చూశానా? సినీమానే నా కలా? అసలు ‘ఇప్పుడూ నిజమ? లేక మొన్న పడుకున్నప్పుడు వచ్చిన కలేనా? ఇలా గత వారంగా అనిపిస్తుంది…
చూసి వారం దాటినా ఇంకా నా మీద చూపుతున్న ప్రభావం ఇది… ఈ సినిమా కథ, కథనం గురించి మాట్లాడే అర్హత కూడా నాకుందని అనుకోను… అసలు ఈ సినిమా గొప్పతనం గురించి కాదు నేను ఇది వ్రాస్తున్నది…
దీని వల్ల నాలో కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ గురించీ… మరియూ… ఇంత అద్బుతమైన చిత్రం చూసినందుకు నాలో కలిగిన ఆనందం గురించీ…
చిన్నప్పటి నుంచీ మనలో ప్రతీ ఒక్కరికి కలల మీద ఏదో ఒక ఆలోచన వుండే వుంటుంది… చాలా మంది కలల గురించి ఒక్క సారి కాకపోతే మరోసారైనా ఆలోచించే వుంటారు… మీ గోల వదిలేస్తే నేను మాత్రం చాలా సార్లు ఆలోచించాను… వాటి మీద నాకున్న అనుభవంతో రెండు సూత్రాలు కూడా అనుకున్నాను… నాకు వచ్చిన ప్రతీ కలని వాటితో పోల్చి…98% నిజం అవ్వడం తో…
దీని గురించి పెద్దగా ఆలోచించడం మానుకున్నాను… కానీ ఒక ప్రశ్న మాత్రం వుండి పోయింది… ఎందుకు ఎవ్వరూ ఈ కలల మీద ఒక సినీమా తియ్యరు అని? ఇంత కన్నా మంచి టాపిక్ ఏముంటుంది మనల్ని కలలలోకం లొకి తీసుకెళ్ళడానికి అని?
కానీ ఈ సినీమా చూశాక………………………………………………………………………………………………. (మాటల్లేవు
)
మన అనుభవాన్ని మరొకరికి పంచడం కొంచం సాధ్యమేమో కానీ, మన ఊహనీ… కలలనీ మరొకరితో పంచుకోవడం సాధ్యం కాదు… అలాంటిది… ఆయన కలల్ని మనకు చూపెట్టడం కాదు… మీ కల ఇదే అని మనది మనకి చూపెట్టినట్టుంది…
కొంచం అతిశయోక్తిలా వుందా? నాకు తెలుసు… అందుకే ఈ సినీమా గురించి నాకనిపించినవి చెప్తే ఎన్ని అతిశయోక్తులని (‘కోత ‘లని కూడా) మీరనుకుంటారో, నేనే వూహించి కింద ఇచ్చాను…
కొంత కాలం క్రితం ‘యూరియా ‘ ని ప్రయోగ శాలల్లో తయారు చెయ్యలేమని… కర్బన మూలకాలు దైవాంశతో మాత్రమే ఉద్బవిస్తాయని అనుకునేవారట… అప్పుడు… వొహ్లర్ అనే మహాశయుడు ఈ యూరియాని ప్రయొగశాలలో చేసి చూపాడట… అప్పట్నించీ ఇప్పటి వరకు కొన్ని వేల కర్బన పదార్థాలు తయారయ్యాయి…
అలాగే, కథలు ముప్పై మూడే అనీ, ఎవ్వరు కథ చెప్పినా వీటినే తిరగేసి మరగేసి చెప్పాలనీ, అందుకే సినీమా వాళ్ళు కూడా, ఈ కథల కొరతలో ఏం చెయ్యలేరనీ, కొన్ని చోట్ల విన్నాను…
‘చూస్తున్నారు కాబట్టే, తీస్తున్నాం…’ అనీ కబుర్లు చెప్పేవాళ్ళు కూడా, ఈ సినీమా ఒక్క సారి చూడాలి…
ప్రేక్షకుల మేధస్సుని తక్కువ అంచనా వెయ్యకుండా… వారిని తమతో పాటు తీసుకెళ్ళే ప్రయత్నం జరిగింది ఈ సినీమాలో…
ఈ సినీమా చుశాక నేను అనుకున్నవి అన్నీ చెప్తే వాటిని అతిశయోక్తులే అని అంటారో… కోత లే అంటారో ఇంకా మరేమైనా అంటారో…(ఇంకా పెద్ద పదం ఏంటో నాకు తెలీదు మరి)… మీ ఇష్టం…
ఆ అతిశయోక్తులు ఎలాంటి వంటే….
1. ఈ సినీమా ఒక యాభై యేళ్ళ క్రితం రాలేదు… మరి అప్పటి సినీ అభిమానులు పాపం…దీన్ని చూడకుండానే చనిపోయారు…అసంపూర్ణంగా…
2. రేపు నేను చనిపోయాకా ఇలాంటి సినీమాలొస్తే…??? అమ్మో !!! అందుకే నాకు చావు అంటే అసహ్యం…
3. ఫోర్థ్ డైమెన్షను, ఫిఫ్తు స్టేటు… ఇవన్నీ హుష్ కాకి… ఇప్పటినుంచి… “నీ కలల్లోకి, నేను…”
హ..హ..హ..
4. ఐరన్ సేఫులూ, నంబర్ తాళాలూ ఇక వేస్టు… ‘తలపులకి ‘ తాళాలు తయారు చెయ్యండి…
5. ‘బాలీ/టాలీ/కోలీ ‘ వుడ్ లు ఇక తూచ్…. లవ్ స్టోరీలా??? యాక్… వెగటు…
6. తింటే గారెలు…చూస్తే ఇన్సెప్షన్…
7. ‘నా కలల్లోకి నువ్వు రాకపొతే, నీ కలల్లోకి నేను వచ్చి నిన్ను కిడ్నాప్ చేసి…మీ నాన్న కలల్లోకి తీసుకెళ్ళితే, అది నిజమో కాదో తెలీక ఆయన భయపడి, నిన్ను నాకు ఇచ్చేసినట్టు…’ నేనే కల గంటా… హ..హ..హ…
8. అన్ని క్రిస్టఫర్ నోలన్ సినీమాలూ… స్పెషల్ డ్యూటి లు వేసుకొని చూస్తా…
9. మరో వంద సంవత్సరాలైనా, ఈ సినీమాని తెలుగు లో చూడడానికి నేను భయపడతా…
10. మరోసారి ఈ సినిమా ని చూద్దామని ఒకసారి అనిపిస్తుంది… వెంటనే ‘అమ్మో, వద్దు’ అనిపిస్తుంది… మొదటిసారి చూసినప్పుడు కలిగే సంచలనం మరోసారి చూసినప్పుడు వుండదేమో అన్న అనుమానం… అందుకే… రెండోసారి దీన్ని చూడను…అనుకోకుండా చూస్తే, మరో పది సార్లు తప్పకుండా చూస్తాను…
ఆ దర్శకుడే అన్నట్టు… కేవలం ఒకే ఒక చిన్న పాయింటు కొత్తగా (వేరేవాళ్ళ కలల్లోకి మనం దూరవచ్చు) ఆలోచించి…
మిగతా మొత్తం కల అల్లి…
మనల్ని కలల్లోకి లాగి…
ఈ కలల్లో…
ష్… దయచేసి గొడవ చెయ్యకండి… నా కల చెదురుతుంది…