ఇన్సెప్షన్ (ఇది కల)… బుధవారం, జన 26 2011 

నిద్ర లేచి వారమైనా ఇంకా ఈ కల (లేక నిజమా???) నన్ను వెంటాడుతూనే వుంది… ఇప్పుడు నేనూ ఒక ‘టోటెం’ కి ఆర్డరివ్వాలనుకుంటున్నాను…

ఎందుకంటే… అసలు నేను ఈ సినీమా చూశానా? లేక కలగన్నానా? కలలో ఈ సినీమా చూశానా? సినీమానే నా కలా? అసలు ‘ఇప్పుడూ నిజమ? లేక మొన్న పడుకున్నప్పుడు వచ్చిన కలేనా? ఇలా గత వారంగా అనిపిస్తుంది…

చూసి వారం దాటినా ఇంకా నా మీద చూపుతున్న ప్రభావం ఇది… ఈ సినిమా కథ, కథనం గురించి మాట్లాడే అర్హత కూడా నాకుందని అనుకోను… అసలు ఈ సినిమా గొప్పతనం గురించి కాదు నేను ఇది వ్రాస్తున్నది…

దీని వల్ల నాలో కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ గురించీ… మరియూ… ఇంత అద్బుతమైన చిత్రం చూసినందుకు నాలో కలిగిన ఆనందం గురించీ…

చిన్నప్పటి నుంచీ మనలో ప్రతీ ఒక్కరికి కలల మీద ఏదో ఒక ఆలోచన వుండే వుంటుంది… చాలా మంది కలల గురించి ఒక్క సారి కాకపోతే మరోసారైనా ఆలోచించే వుంటారు… మీ గోల వదిలేస్తే నేను మాత్రం చాలా సార్లు ఆలోచించాను… వాటి మీద నాకున్న అనుభవంతో రెండు సూత్రాలు కూడా అనుకున్నాను… నాకు వచ్చిన ప్రతీ కలని వాటితో పోల్చి…98% నిజం అవ్వడం తో…

దీని గురించి పెద్దగా ఆలోచించడం మానుకున్నాను… కానీ ఒక ప్రశ్న మాత్రం వుండి పోయింది… ఎందుకు ఎవ్వరూ ఈ కలల మీద ఒక సినీమా తియ్యరు అని? ఇంత కన్నా మంచి టాపిక్ ఏముంటుంది మనల్ని కలలలోకం లొకి తీసుకెళ్ళడానికి అని?

 కానీ ఈ సినీమా చూశాక………………………………………………………………………………………………. (మాటల్లేవు ;) )

మన అనుభవాన్ని మరొకరికి పంచడం కొంచం సాధ్యమేమో కానీ, మన ఊహనీ… కలలనీ మరొకరితో పంచుకోవడం సాధ్యం కాదు… అలాంటిది… ఆయన కలల్ని మనకు చూపెట్టడం కాదు… మీ కల ఇదే అని మనది మనకి చూపెట్టినట్టుంది…

కొంచం అతిశయోక్తిలా వుందా? నాకు తెలుసు… అందుకే ఈ సినీమా గురించి నాకనిపించినవి చెప్తే ఎన్ని అతిశయోక్తులని (‘కోత ‘లని కూడా) మీరనుకుంటారో, నేనే వూహించి కింద ఇచ్చాను… :)

కొంత కాలం క్రితం ‘యూరియా ‘ ని ప్రయోగ శాలల్లో తయారు చెయ్యలేమని… కర్బన మూలకాలు దైవాంశతో మాత్రమే ఉద్బవిస్తాయని అనుకునేవారట… అప్పుడు… వొహ్లర్ అనే మహాశయుడు ఈ యూరియాని ప్రయొగశాలలో చేసి చూపాడట… అప్పట్నించీ ఇప్పటి వరకు కొన్ని వేల కర్బన పదార్థాలు తయారయ్యాయి…

అలాగే, కథలు ముప్పై మూడే అనీ, ఎవ్వరు కథ చెప్పినా వీటినే తిరగేసి మరగేసి చెప్పాలనీ, అందుకే సినీమా వాళ్ళు కూడా, ఈ కథల కొరతలో ఏం చెయ్యలేరనీ, కొన్ని చోట్ల విన్నాను…

‘చూస్తున్నారు కాబట్టే, తీస్తున్నాం…’ అనీ కబుర్లు చెప్పేవాళ్ళు కూడా, ఈ సినీమా ఒక్క సారి చూడాలి…

ప్రేక్షకుల మేధస్సుని తక్కువ అంచనా వెయ్యకుండా… వారిని తమతో పాటు తీసుకెళ్ళే ప్రయత్నం జరిగింది ఈ సినీమాలో…

ఈ సినీమా చుశాక నేను అనుకున్నవి అన్నీ చెప్తే వాటిని అతిశయోక్తులే అని అంటారో… కోత లే అంటారో ఇంకా మరేమైనా అంటారో…(ఇంకా పెద్ద పదం ఏంటో నాకు తెలీదు మరి)… మీ ఇష్టం…

ఆ అతిశయోక్తులు ఎలాంటి వంటే….

1. ఈ సినీమా ఒక యాభై యేళ్ళ క్రితం రాలేదు… మరి అప్పటి సినీ అభిమానులు పాపం…దీన్ని చూడకుండానే చనిపోయారు…అసంపూర్ణంగా… :(

2. రేపు నేను చనిపోయాకా ఇలాంటి సినీమాలొస్తే…??? అమ్మో !!! అందుకే నాకు చావు అంటే అసహ్యం…

3. ఫోర్థ్ డైమెన్షను, ఫిఫ్తు స్టేటు… ఇవన్నీ హుష్ కాకి… ఇప్పటినుంచి… “నీ కలల్లోకి, నేను…” ;) హ..హ..హ..

4. ఐరన్ సేఫులూ, నంబర్ తాళాలూ ఇక వేస్టు… ‘తలపులకి ‘ తాళాలు తయారు చెయ్యండి…

5. ‘బాలీ/టాలీ/కోలీ ‘ వుడ్ లు ఇక తూచ్…. లవ్ స్టోరీలా??? యాక్… వెగటు…

6. తింటే గారెలు…చూస్తే ఇన్సెప్షన్…

7. ‘నా కలల్లోకి నువ్వు రాకపొతే, నీ కలల్లోకి నేను వచ్చి నిన్ను కిడ్నాప్ చేసి…మీ నాన్న కలల్లోకి తీసుకెళ్ళితే, అది నిజమో కాదో తెలీక ఆయన భయపడి, నిన్ను నాకు ఇచ్చేసినట్టు…’ నేనే కల గంటా… హ..హ..హ… ;)

8. అన్ని క్రిస్టఫర్ నోలన్ సినీమాలూ… స్పెషల్ డ్యూటి లు వేసుకొని చూస్తా…

9. మరో వంద సంవత్సరాలైనా, ఈ సినీమాని తెలుగు లో చూడడానికి నేను భయపడతా…

10. మరోసారి ఈ సినిమా ని చూద్దామని ఒకసారి అనిపిస్తుంది… వెంటనే ‘అమ్మో, వద్దు’ అనిపిస్తుంది… మొదటిసారి చూసినప్పుడు కలిగే సంచలనం మరోసారి చూసినప్పుడు వుండదేమో అన్న అనుమానం… అందుకే… రెండోసారి దీన్ని చూడను…అనుకోకుండా చూస్తే, మరో పది సార్లు తప్పకుండా చూస్తాను…

ఆ దర్శకుడే అన్నట్టు… కేవలం ఒకే ఒక చిన్న పాయింటు కొత్తగా (వేరేవాళ్ళ కలల్లోకి మనం దూరవచ్చు) ఆలోచించి…

మిగతా మొత్తం కల అల్లి…

మనల్ని కలల్లోకి లాగి…

ఈ కలల్లో…

ష్… దయచేసి గొడవ చెయ్యకండి… నా కల చెదురుతుంది… :)

అందమా…అందుమా… మంగళవారం, జన 4 2011 

“A thing of beauty is joy forever…” అట… ఈ రోజు దీనికి సంబందించిన వివరాలు చూసాను.
మొత్తం “Endymion” పద్యం వెతక్కపోయినా, Wiki లో దొరికిన చిన్న పద్య పాదం చదివాను… అర్ధమయ్యీ… అర్ధం కాక, ఓ మోస్తరుగా భావం అర్ధమయ్యింది…
John Keats గారి పద్యం ‘Bright star’ అంత బాగా అర్ధం అవ్వకపోయినా… పై వాక్యం ఒక్కటి చాలదూ…నాకు ;)    

 
నా చిన్నప్పుడెప్పుడో, పై వాక్యం విన్నాను… తర్వాత మళ్ళీ ఎక్కడో చదివినప్పుడో, గుర్తొచ్చినప్పుడో… దీని గురించి ఆలోచిస్తుంటే, ఏదో ఒక చిలిపి ఊహ తలపుల్లోకి వచ్చేది. అలాంటి కొన్ని తలపులే ఇవ్వి…
కవి ఏ ఉద్దేష్యంతో  కవిత వ్రాశాడో శోదించటం నాకు తెలీదు. దాన్ని నాకు నచ్చిన విధంగా అన్వ్యయించుకొని ఆనందిచటమే తేలిక, సుఖం… అందం  కూడానూ ;)  
 అందం… దీన్ని నేను చాలా రోజులు ఒక ‘Relative term’ అనుకునేవాన్ని ;)   కానీ ప్రస్తుత అభిప్రాయం ప్రకారం అది పూర్తిగా నిజం కాదు. అంటే అందం అనేది 20 % ‘Relative’ గా వుండొచ్చు…కానీ 80 % ‘Absolute’.
అంటే అందం  అనేది  ‘objective’, ‘measurable’, ‘quantifiable’, ‘definable’ etc…etc…

  ఎలా ఇది ‘Absolute’ అని చర్చించే ముందు…అసలు ‘అందం’ అవసరమైనదేంటి అనేది చూద్దాం,
1. పరిసరాలు
2. ప్రక్రుతి
3. మనుష్యులు, జంతువులూ… etc…
1. పరిసరాలు:
అంటే మన ఇళ్ళు, మన ఆఫీసు, కాలేజీ, etc…etc… స్థూలంగా అనుకోవాలంటే మనం తరచుగా తిరుగాడే స్థలాలు… ఇవ్వి అందంగా వున్నాయి అని ఎలా చెప్పటం?

 వీటి అందాన్నిఅసలు మనం అదుపులో పెట్టొచ్చా అంటే ‘అవును’ అనే అనాలి…
 ‘పొందికగా, కేటాయించబడిన స్థానంలో, శుబ్రంగా, కుదురుగా, వస్తువులు అమరినప్పుడు, ఆ పరిసరాలలో అందం ద్యోతకమవుతుందీ…’ ఇది నా అభిప్రాయం.

పొందికగా ఎలా అమర్చాలి అనేది మళ్ళీ వ్యక్తిగతం. (Relative అభిప్రాయం). కానీ ఎలా అమర్చినా, పొందిక, శుబ్రత వుంటే కళ్ళకి ఆహ్లాదం…అదే అందం ;)

2. ప్రక్రుతి:
ప్రక్రుతి అందమైయినదే కానీ ప్రక్రుతిలోని అన్నీ అందమైయినవి కావు… ప్రక్రుతి లోని విలయాలు అందమైనవి కావు. అందులోని కొన్ని దశలు అందమైనవి కావు. కానీ సహజంగానే, ప్రక్రుతిలో కొన్ని అమరికలున్నాయి… ప్రక్రుతిలోని అమరికల గురించి   సైన్సుని కూడా  తీసుకోవచ్చుగానీ, నేను రవీంద్రున్ని తీసుకోవడానికి  ఇష్టపడతాను. ఆయన ‘గీతాంజలి’ లో ఒక చోట అంటారు… ‘సారం లేని సరళ రేఖల్ని త్యజించి, అద్బుతమైన వంపులలో……’  అని. అంటే ప్రక్రుతి లోని కొన్ని కుదురైన వంపులు మనకి అందం… అంతే…
ప్రక్రుతి అందమైయింది… దాని అందాన్ని మనం పెంచలేం… పెంచాలని ప్రయత్నిస్తే అది విక్రుతవుతుంది. ఆందుకని దాన్నలా ఆస్వాదించటమే ఆనందం…

3. ఇక పోతే మనుష్యులు… (సైంటిఫిక్ గా మనిషీ ఒక జంతువే అయినా,  ప్రస్తుతానికి మనుష్యుల గురించే అనుకుందాం… వేరే  జంతువులు మనకొద్దు ;)   మనుష్యుల అందం…అబ్బో, ఇదీ (దీని కోసం) చెయ్యని పని లేదు. దీని మీద ఇప్పుడున్నంత పిచ్చి మరెప్పుడూ లేదనుకుంటాను… ముఖ్యంగా అందం ‘Relative’ అనుకోవలసి వచ్చేది మనుష్యుల  తోనే… కానీ, మనుష్యుల్లోనూ అందాన్ని కొలిచే పద్దతుందని చాల రోజుల క్రితం చదివాను… దాని ప్రకారం, మొహంలోని వివిధ భాగాల కొలతల ‘Ratio’ తీసుకుంటే  అది ‘సున్నా కి’  దగ్గరగా రావాలట… అలా వస్తే అది అందమైన మొహం అట. అలా మన నేతల మొహాల్ని కొలిస్తే… రాజీవ్ గాంధి గారిది సున్నాకి దగ్గరగా వచ్చిందట…(మరి మన నేతల మనసుల అందాన్ని  కొలవగలిగేది కనిపెట్టారో లేదో ;) ) సో, దీన్ని బట్టి తేలిందేమిటంటే మనుష్యుల అందాన్నీ మనం కొలవచ్చు. ‘Physical beauty is not volition’ అని అయాన్ ర్యాండ్ కూడా ఒక చోట అన్నారు.

 వీటన్నింటినీ బట్టి చూస్తే, శుబ్రంగా, కుదురుగా, పొందికగా, మన పరిసరాల్నీ, మనల్నీ వుంచుకుంటే మనం అందమయినవాళ్ళం :)
ఎక్కడికక్కడ విసిరేసిన సామాన్లూ, పేరుకు పోయిన దుమ్ము, కుదురులేని అమరిక, ఇవి పరిసరాల్ని వికారం చేస్తాయి…

అందం కోసం వేల రూపాయల కార్పెట్లు అవసరం  లేదు, పేడతో అలికిన నేలయినా, శుబ్రంగా  వుంటే బావుంటుంది…ఖరీదయిన ఎమల్షన్ పెయింట్లు అవసరం లేదు, మరకలు లేని సున్నపు గోడే అందం…

వేల రూపాయల డ్రెస్సులూ, కాస్మెటిక్సూ అవసరం లేదు… కొవ్వు చేరని, వాసన రాని ఒళ్ళు చాలు…

చివరగా ‘An ounce of courage is enough to remove a ton of distress’ అట…
నా వరకూ ‘పావు ఔన్సు శ్రద్ద,  పావు ఔన్సు ఓపిక, పావు ఔన్సు ఆలోచన, మిగతా ఔన్సు శ్రమ చాలు, ఒక టన్ను అందాన్ని స్రుష్టించడానికి”

ఈ చిన్ని సూత్రం (ముఖ్యంగా పరిసరాల శుబ్రత లో) నాకు ప్రాక్టికల్ గా  ప్రవర్తనలో చూపెట్టి… నాకూ కొంచం శుబ్రం నేర్పిన నా స్నేహితుడు… ‘కిచ్చూ’  కి నా….

అబ్బే వాడికివన్నీ అవసరం లేదు లేండి…. ;)

సీ’రియల్ ‘ సోమవారం, జన 3 2011 

… మెలో డ్రామాని దట్టించిన ఒక పాత మూస కథ… కానీ ఇప్పుడూ మార్పు లేదు… ;)

విజయాన్నీ, మత్తునీ పక్క పక్కనే పెడితే మత్తు కన్నా ప్రమాదకరమైనది విజయం. మత్తునైనా మరోసారి మరవచ్చు గానీ విజయాన్ని ఒక్క సారి అనుభవిస్తే మరోసారి ఓటమిని అంగీకరించలేరు.

అలాంటి విజయాన్ని, మత్తులో రంగరించి ఒంటరిగా ఆస్వాదిస్తున్నాడు శరత్. బాటిల్లోని ఆనందాన్ని కొంచం గ్లాసులోకి వంపి, కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ, టీవి చూస్తున్నాడు. రెండు నిమిషాల యాడ్స్ తర్వాత సీరియల్ మొదలయ్యింది. అతను వ్రాసిన సీరియల్ “పతివ్రత” వందవ ఎపిసోడ్ ఆ రోజు. వరుసగా అతని మూడో సీరియల్ ఆ ఘనతని సాధించింది. అదీ ఆనందం. అతని భార్య పుట్టింటికి వెళ్ళటంతో ఒంటరిగా ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. టీవీలో   ఆ రోజు సీరియల్ బదులు, నటీ నటులు, టెక్నీషియన్ల తో ఇంటర్వ్యూని ప్రసారం చేస్తున్నారు.

కొద్దిసేపటి తర్వాత  స్క్రీన్ మీద శరత్ ప్రత్యక్షమయ్యాడు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు  క్రుతజ్ఞతలు    మరియు తన అనుభవాలు చెప్తున్నాడు. గంట సేపటి స్పెషల్ ప్రోగ్రాం అయిపోగానే ఫోన్ మోగింది.

ఏడుకొండలు చేశాడు, ఫోనెత్తగానే “ఏమయ్యా… కంగ్రాట్స్” అన్నాడు. అతనే శరత్ మూడు సీరియల్ల నిర్మాత. “చూశావ్ గదా ఎంత క్రేజొచ్చిందో మన సీరియల్కి. ఇంకో పది ఎపిసోడ్లలో ముగిస్తానంటున్నావు. మరోసారి అలోచించు. డైరెక్టర్ కూడా అంటున్నాడు మరో 50 ఎపిసోడ్లన్నా పెంచాలని” సూటిగా విషయం చెప్పాడు.

“ఏడుకొండలు గారూ. ముహూర్తం రోజు నుంచీ చెప్తున్నాను. మన సీరియల్ 110 ఎపిసోడ్లే అని మళ్ళి ఇంకో 40 ఎపిసోడ్లు పెంచమంటారేంటీ?” కొంచం తీవ్రంగానే అన్నాడు శరత్.

“అదికాదయ్యా, బాబూ. మన ముందు సీరియల్లకి కూడా లేని క్రేజు దీనికొచ్చె. జనం ఎగబడి చూస్తుండె. అనుకున్నదింతే అని ఇప్పుడే ఆపితే బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకున్నట్టే కదా?” కొంచం బతిమాలుతున్నట్టుగా అన్నాడు ఏడుకొండలు. అతను చాలా డిప్లొమాట్, అందుకే చాలా తొందరగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించాడు. అసలు ఒక నిర్మాత, ఒక రచయితని ఇంతగా అడగడు, కానీ ఏడుకొండలు అలా కాదు. తన పనికోసం కాళ్ళూ పట్టుకోగలడు, జుట్టూ పట్టుకోగలడు.. ఆ విషయం బాగా తెలుసు శరత్ కి. అయినా చివరి ప్రయత్నంగా అన్నాడు “అనుకున్నట్టు తీసాం కాబట్టే జనం ఎగబడి చూస్తున్నారు.ఇంకా సాగతీస్తే, అప్పుడెవరూ చూడరు. ఇప్పుడు ఆపితే కనీసం మంచి పేరయినా మిగుల్తుంది”.

అవతలి వైపు మౌనం. శరత్ కి తెలుసు ఏడుకొండలి మనస్తత్వం. కానీ, ఈ పని తనకిష్టం లేదు కాబట్టే ఇన్నిసార్లు చెప్పాడు, తర్వాత అతనిష్టం.రెండు నిమిషాల మౌనం తర్వాత అన్నాడు ఏడుకొండలు.
“ఈ సీరియల్ని ఆపేయటం నాకిష్టం లేదు. నీకంతగా ఇష్టం లేక వ్రాయలేననుకుంటే చెప్పు. వేరేవాళ్ళతో వ్రాయిద్దాం. తొందరేం లేదు. రేప్పొద్దున్న ఆఫీస్ కి వచ్చేటప్పటికి అలోచించు. ఎకౌంట్ సెటిల్ చెయ్యాలో? స్టొరీ డిస్కషన్స్ కి రూం బుక్ చెయ్యాలో. నీ ఇష్టం”. అని పెట్టేశాడు.

పరిస్తితులు ఇలా రావొచ్చొని ముందే వూహించాడు శరత్. అవసరమైతె చివరి అస్త్రాన్ని ఉపయోగిస్తాడని తెలుసు. అయినా ఇప్పుడు తను కేవలం తన ఆనందం కోసం వ్రాసుకునే రచయిత కాదు. తన ప్రోడక్ట్ ని జనానికమ్మే వ్యాపారవేత్త. మనుగడ కావాలంటే కొంత??? సంత్రుప్తిని కోల్పోక తప్పదు.

కొంచం సేపటి క్రితం వున్న ఆనందం ఫోన్లో మాట్లాడగానే ఆవిరయ్యింది. ఇంతకు ముందు ఆనందాన్ని పెంచడానికి తాగిన మందు ఇప్పుడు విషాదాన్ని పంచుకోవడానికి సిద్దపడినట్టుగా వుంది. చిన్నగా నవ్వుకొని మరో పెగ్గు పోసుకోబోతుంటే కాలింగ్ బెల్ మోగింది.

గ్లాస్ పక్కన పెట్టి వెళ్ళి తలుపు తీసి, వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా అన్నాడు “మాలినీ”.

“లోనికి రానిస్తే ఇద్దరం కలిసి ఆశ్చర్య పోవచ్చు” నవ్వుతూ అంది మాలిని. “ఓ సారీ, రా…రా” అంటూ లోపలికి దారి తీశాడు.

బాటిల్సూ, ఇతర సరంజామా అంతా సర్దబోతుంటే అంది మాలిని. “నువ్వు తాగితే నాకేం అభ్యంతరం లేదు శరత్. ఆడ కంపెనీ నీకిష్టం లేకపోతే వదిలెయ్యి. నాకు మాత్రం ఏదైనా సాఫ్ట్ డ్రింక్ ఇవ్వు” అంది.

ఫ్రిజ్లోంచి కూల్ డ్రింక్ తీస్స్తూ అన్నాడు “నువ్వు మా ఇంటికి రావడం ఆశ్చర్యంగా వుంది. షూటింగున్నట్టుంది కదూ ఈ రోజు? అయిపోగానే ఇటే వస్తున్నావా?”. మాలిని “పతివ్రత” సీరియల్ లో హీరోయిన్.

“అవును!!! ఈ రోజు క్లైమాక్స్. కొండమీదినుంచి దూకి చనిపోయే సీన్. చాలా నేచురల్ గా వచ్చింది” అంది. ఆమె కంఠంలో చిన్న జీర.
    
అది గమనించకుండా ఆమె చేతికి కూల్ డ్రింక్ ఇచ్చి, తను పెగ్గు తీసుకుంటూ అడిగాడు. “భోంచేసావా? ఏమైనా చెయ్యమంటావా?”. అతనికీ, మాలినికీ మంచి రిలేషన్ వుంది. ఇండస్ట్రీ కొచ్చిన కొత్తల్లో శరత్ కి చాలా మోరల్ సప్పొర్ట్ ఇంచ్చింది మాలిని. అందుకే ఆమె పట్ల చాలా అభిమానంగా వుంటాడు శరత్.

సూటిగా అసలు విషయం చెప్పింది మాలిని. “శరత్, ఈ సీరియల్లో నటిస్తుంటే నాకు లోకం మీదే నమ్మకం పోతుంది. ఒక్కటీ మంచి కారెక్టర్ లేదు. అన్నీ నన్ను అనుమానించి, అవమానించే కారెక్టర్లే. వీళ్ళందరికీ భయపడి నేనాత్మహత్య చేసుకోవడం. నాకస్సలు నచ్చలేదు. దయచేసి క్లైమాక్స్ అయినా మార్చగలవా? చనిపోయినట్టు కాక హోటల్లో కప్పులు కడుగుతూ బ్రతికినట్టు చూపినా సరే. ఏమంటావు?” 

అతనికి ఆశ్చర్యంగా వుంది. ముందు నుంచీ మాలినికి ఈ కారెక్టర్  ఇష్టం లేదు అన్న విషయం తెలుసు కానీ ఇన్ని ఎపిసోడ్ల తర్వాత ఇప్పుడు బయటపడింది. ఆమె అంత బాగా నటించడానికి కారణం అప్పుడు తెలిసింది. ” నాకు ఆడవాళ్ళలో మంచి పేరయితే (సానుభూతి??) వచ్చింది కానీ, ఈ రొటీన్ చవకబారు సీరియల్లలో నటించీ, నటించీ నాకు విసుగొచ్చింది. నాకు రిలేషన్స్ మీద నమ్మకం పోతుంది” అంది.

“చవకబారు” అన్న పదం ఉపయోగించిందుకు హర్టయ్యాడు శరత్.

అలా సడన్ గా వచ్చి తన తన రచనలని తన ముందే విమర్శిస్తే, తట్టుకోలేకపోయాడు.

“అంటే నేను రాసినదంతా చెత్త అనేనా నీ వుద్దేశ్యం” అన్నాడు. మాలిని మాట్లాడలేదు.  “ఏం మంచి లేకుండానే నా సీరియల్స్ టాప్ రేటింగ్స్ లో నిలబడతాయా?” అన్నాడు. నిజానికి అతనికీ తెలుసు, ఏం వ్రాయాలనుకున్నాడో? ఏం వ్రాస్తున్నాడో.
అప్పటి వరకూ మౌనంగా వున్న మాలిని కొంచం ఆవేశంగా అంది “ఏం మంచి వుంది నీ సీరియల్లలో చెప్పు. రేటింగ్స్ లో టాప్ పొజిషన్లో వుండటం, ఎక్కువమంది నీ సీరియల్ చూడటం… ఈ కారణాల వల్ల నీ సీరియల్ మంచిది అనుకుంటే అది నీ ఫూలిష్ నెస్స్. నీ మొదటి సీరియల్ “బానిస”, ఇద్దరు పెళ్ళాల మొగుడి కథ. మొగుడు వద్దన్నా, తిట్టినా, కొట్టినా,  అతన్నే పట్టుకు వేళ్ళాడే బానిసల కథ. రెండో సీరియల్ “కుటుంబం” , ఒక్కరు కూడా మరొకర్ని నమ్మని గొప్ప కుటుంబం. మొగుడి మీద పెళ్ళానికి, అత్త మీద కోడలికి, తల్లి మీద కొడుక్కి అపారమైన అనుమానం. ఇప్పుడు “పతివ్రత” శారీరకంగా చెడిపోకుండా తన అన్ని బలహీనతలకి మంచితనం ముసుగేసుకున్న ఓ అబల కథ. నీకు హ్యాట్సాఫ్ శరత్. ఆడవాళ్ళ బలహీనతని అద్బుతంగా క్యాష్ చేయగలిగే నీ టాలెంట్ కి”.

ఆమెనే చూస్తుండిపోయాడు శరత్. ఆమె మాటలు విని ఎంతగా ఆశ్చర్యపోయాడంటే, కొద్ది సేపు మాట్లడలేదు. గాఢ నిద్రలో వున్నవాడి మీద బకెట్ నీళ్ళు కుమ్మరించినట్టయ్యింది. ఒక్కసారిగా వచ్చి అన్నీ నిజాలే మాట్లాడితే తనేం చెప్పగలడు. తాగిన ఏ కొంచమో వుంటే , ఆ మత్తూ దిగిపోయింది. చివరికి అన్నాడు.  “మరైతే ఏం వ్రాయమంటావు? మంచే రాస్తాం!!! అంతా మంచే రాస్తాం. నువ్విలా వుండు, నువ్వా తప్పు చెయ్యకు అంటూ ప్రవక్తల్లాగా భోదిస్తాం. ఎంత మంది చూస్తారు? ఎన్ని రోజులు చూస్తారు? ప్రజలు టీవీ చూసేది వినోదం కోసం కానీ, నీతి పాఠాల కోసం కాదు” చిన్నగానే అన్నాడు, కానీ కరుగ్గా అన్నాడు. ఆ మాటల్లో…  తనలో పేరుకున్న ఫ్రష్ట్రేషన్ కొంచం బయటపడింది.

అతను కరెక్టుగా రావల్సిన పాయింట్ కే  వచ్చడన్నట్టు అంది “కరెక్ట్, వాళ్ళు చూసేది వినోదం కోసం, ఒప్పుకున్నావ్ కదా? మరి మీరు వినోదం ఇవ్వాలిగానీ, ఏడుపులూ, పెడబొబ్బలూ, అనుమానాలూ,  హత్యలు, పగలు, ప్రతీకారాలు, రంకులు, బొంకులూ, ఇవ్వి కాదు. ఇవి కాదు వాళ్ళకి కావల్సింది. ఒక భర్త, భార్యతో ఎంత బాగా వుండొచ్చో, తల్లి దండ్రులు, తమ పిల్లలతో ఎంత ఆనందంగా వుండొచ్చో, అత్తా, కోడళ్ళ రిలేషన్ ఎంత గమ్మత్తయినదో, ఒక ప్రియుడు, తన ప్రేయసిని ఎంత బాగా ప్రేమించొచ్చో, చుట్టూ వున్నవాళ్ళతో మన అనుభందం ఎంత ఆహ్లాదంగా వుండొచ్చో చెప్పు. ఇన్వన్నీ చాలా సహజమైన విషయాలు, వీటన్నింటినీ ఎంత వినోదాత్మకంగా చెప్పొచ్చో అలోచించు. ఇది చెప్పడానికి కూడ ఒక అత్త, ఒక కోడలు, ఒక కొడుకు, ఒక భర్త, ఈ కారెక్టర్ల్లే కావాలిగాని, మత గురువులో, ప్రవక్తలో కాదు.  ఇదంతా చేయడానికి, నువ్వు కొత్తగా కష్టపడాల్సిందేమీ లేదు. ఇప్పుడు వ్రాసేదే వ్రాయి. కానీ నెగటివ్ గా కాదు, పాజిటివ్ గా.” అంతా విన్నాక, శరత్ అలోచించాడు. తల పగిలిపోయేలా అలోచించి నవ్వుకున్నాడు. అతన్ని చూసి చెప్పింది మాలిని. “ఇదంతా మాకు తెలీనట్టు, మేం అలోచించనట్టు చెబుతుంది అని నవ్వుకోకు శరత్”  అద్దిరిపడ్డాడు శరత్. ఆ క్షణం నిజంగా అలాగే అనుకున్నాడు.”నేను చెప్పేది సులభం కాదు, కానీ కష్టమూ కాదు. కష్టపడే ధైర్యం లేక అందరి దారిలో నువ్వూ నడుస్తున్నావు. కానీ కొత్త దారిని కనిపెట్టేది ఎవరో ఒకరే. మిగతా అంతా దాన్ని ఫాలో అవుతారు. నువ్వు వెనకే వుండాలనుకుంటున్నావో, ముందుకొస్తావో నీ యిష్టం. వెళ్తా మరి” అంటూ లేచింది మాలిని. 

తుఫానులా వచ్చి వెళ్ళిపోతుంది. ఎందుకొచ్చిందో, ఎందుకెళ్తుందో అర్ధం కాలేదు. “నేను నిజంగా నీకు నా బాధ చెప్పు కోవడానికి వచ్చానే  కానీ నీ వల్ల కాదని తెలిసిపోయింది. అందుకే వెళ్తున్నాను.” మళ్ళీ తెల్లబోయాడు శరత్. తన మనసులో అనుకున్నవన్నీ బయటకి చదువుతుంది ఈ రోజు. మైకంలో తను అన్నీ బయటకే అనట్లేదు  కదా అన్న సందేహం కూడా వచ్చింది. ఇంతలో తను వెళ్తాను అని వెళ్లిపోయింది. తనని ఎల వెళ్తావు అని అడిగే ధైర్యం కూడా చేయలేదు శరత్. డోర్ వేసి వచ్చి, ఆ నిజాల్ని జీర్నించుకోలేక స్ప్రుహ కోలొయేవరకు తాగాడు ఆ రాత్రి.

తెల్లవారుఝామానే ఫోన్ ఆగకుండా మోగుతుంటే లేచాడు శరత్. తల పట్టేసింది. ఫోన్ చేసింది ఏడుకొండలు. అతను చెప్పిన విషయం విన్న తర్వాత పూర్తిగా మత్తు వదిలింది శరత్ కి.

“మాలిని చనిపోయింది”

కలో, నిజమో అర్ధం కాని పరిస్తితులలో అప్రయత్నంగా అడిగాడు “ఎప్పుడు? ఎలా?” అని. 

“నిన్న సాయంత్రం!!! క్లైమాక్స్ షూటింగ్ లో కొండ చివర మీది నుంచి పడిపోయింది. ఏం జరిగిందో తెలీదు. కావాలనే దూకిందని కొందరు, కాదు ఏక్సిడెంటల్ అని కొందరు అంటున్నారు. వెంటనే హాస్పటల్ కి తీసుకెళ్ళారు. రాత్రి ఏడున్నరకి చనిపోయింది” వింటున్న శరత్ ఉలిక్కిపడ్డాదు. సరిగ్గా ఆ ప్రాంతంలోనే  తన దగ్గరికి వచ్చింది మాలిని.

“మీరు చెప్పేది నాకర్ధం కావట్లేదు” గొంతు తడారిపోతుంటే అన్నాడు. శరత్.

“నేను చెప్తుంది నిజం. నాకు ఎనిమిదింటికి తెలిసింది. అప్పటినుంచి  నీకు ట్రై చేస్తుంటే., నీ మొబైల్ స్విచాఫ్ అని వచ్చింది” వెంటనే మొబైల్ చూస్కున్నాడు శరత్. బాగానే వుంది. ఏడుకొండలు ఫోన్లో ఇంక చెప్తున్నాడు ” లాండ్ లైన్ కి చేస్తే,  రింగవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చెయ్యట్లేదు. ఫోన్ డెడ్ అయ్యిందనుకుంటాను” అంటూ ఇంకా ఏదో చెప్తున్నాడు ఏడుకొండలు. కానీ శరత్ కి ఏమీ వినపడట్లేదు. అప్పటికే మందు లేకుండానే, మరోసారి స్ప్రుహ కోల్పోయ్యాడు.

Follow

Get every new post delivered to your Inbox.