నాకు నచ్చిన అనువాద కవిత్వం శుక్రవారం, అక్టో 16 2020 

మంచి కవిత్వం ఏ భాషలోనైనా బావుంటుంది, ఉర్దూలో ఇంకొంచం ఎక్కువ  బావుంటుంది. నాకు నచ్చిన ఇతర భాషల్లోని కవిత్వం (ప్రధానంగా ఉర్దూ భాష నుంచి) ఇక్కడ నాకు గుర్తుండటం కోసం రాసుకుంటున్నాను. తెలిసిన ప్రతీ చోటా రచయితల వివరాలు ఇస్తాను.

ఖ్వాబ్ థా, యా ఖయాల్ థా, క్యా థా?

హిజ్ర్ థా, యా విశాల్ థా,  క్యా థా?

చమ్కీ బిజ్లీ సీ పర్ నా సమ్జే హమ్

హుస్న్ థా యా జమాల్ థా,  క్యా థా?

రచయిత: షేక్ గులామ్ హందాని  ముస్ హఫి

ఇది కలా? లేక నీ గురించిన ఆలోచనా? తెలీటం లేదు

ఇది మన వియోగమా? లేక కలయికా? తెలీటం లేదు

మెరుపులా మెరిసింది ఏమిటో, అర్థం కాలేదు

అది నీ అందమా? లేక ఆయన చేసిన అద్బుతమా? తెలీటం లేదు

ఒకవేళ అనువదించిన నా తెలుగు చదివి మీరు పెదవి విరిస్తే, ఆ తప్పు పూర్తిగా నాదే కానీ ఆ కవిత్వానిది కాదు.

రెండు పుస్తకాలు బుధవారం, జూలై 22 2020 

ఆవకాయ తో అన్నం తిన్న తర్వాత, ఆపిల్ పై ని డెసర్ట్ గా తిన్నట్టయ్యింది నా పరిస్తితి ఈ వారం. పూర్తిగా వైరుధ్యమైన రెండు గొప్ప రుచులని అనుభవించానని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశ్యం.

రెండు మంచి పుస్తకాలు వెంట వెంటనే చదివిన అనుభవాలు ఇంతకు ముందే వున్నా, ఈసారి కలిగిన అనుభవం మాత్రం గిలిగింతలు పెట్టింది, ఎంత యాదృచ్చికంగా జరిగినా.

ఒక కథ నిజం, మరోటి కల్పితం, ఒక కథ దళితుల గాథ, మరొకటి బ్రాహ్మణ ఘోష, వైరుధ్యాలతో పాటు ఎన్నో సామీప్యతలు. రెండు కథలూ మూడు తరాల చరిత్రలు. రెండింటిలోను వలస యాత్రలు. ఆచారం ఎక్కువై చదువుకి అడ్డంకులు ఒకరు ఎదుర్కొంటే, ఆచారం తక్కువవ్వటం వల్ల చదువుకోవటం కష్టమైన వారు మరొకరు. ఏదేమైనా రెండూ కదిలించే కథలు. ఏక బిగిన చదివించే బిగువూ, చదివిన తర్వాత మనసులో గూడు కట్టుకొని కొన్ని రోజులపాటు వెంటాడే శైలీ ఈ రెండు పుస్తకాల సొంతం.

 

విషయం లోకి వస్తే, నేను చదివిన మొదటి పుస్తకం, ‘నా పేరు బాలయ్య’, రచయిత వై. బి. సత్యనారాయణ గారు.

ఇది నిజ జీవిత చరిత్ర. మూడు తరాల వీరి వంశ చరిత్ర. దళితులుగా పుట్టి, దొరల కోసం బతుకుతున్న జీవితంలో, ఒక తరం వేసిన మొదటి అడుగు తర్వాతి రెండు తరాల్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో, చదువు ఎంత ముఖ్యమో, ఏమీ లేని బ్రతుకులలో చదువు ఎంత మార్పు తేగలదో ఈ పుస్తకం వివరిస్తుంది. దీనికి సజీవ సాక్ష్యాలుగా వారి జీవితాలే మనకు  కనిపిస్తాయి. ఈ పుస్తకం 2011 లోనే ప్రచురించబడినా,  మొదటి సారి ఈ పుస్తకం గురించి, ‘కబాలి ‘ సినీమా ద్వారానే తెలిసింది. తర్వాత కొన్ని రోజులకి ఈ పుస్తకం కొన్నాను, కానీ మొన్నటి వరకూ చదివే ధైర్యం చేయలేదు. కారణం ముందే ఏర్పరుచుకున్న ఒక అపోహ వల్ల, అంటే దళిత సమస్య అనగానే, చాలా విషాదభరితమైన కథ కావచ్చు,  భీభత్స వర్ణనతో నిండి దయా రసంతో ముగుస్తుందేమో, అలా అనిపించి, దీన్ని చదవటం ఆలస్యమైంది. కానీ చదవటం మొదలుపెట్టాక, ఒక స్వీట్ సర్ప్రైజ్.  చాలా ఆహ్లాదంగా సాగింది. వారు ఎదుర్కొన్న కష్టాల వేడిని, మనకి చలువ కళ్ళద్దాలు తొడిగి చూపెట్టినా, అంతర్లీనంగా, మనకి ఆ సెగ తగులుతూనే వుంటుంది. నా దృక్పధాన్ని విశాలం చేసుకోవడానికి దొరికిన ఒక అవకాశంలా అనిపించింది.

మొదట ఈ పుస్తకం ఇంగ్లీషులో విడుదలయ్యింది. తర్వాత తెలుగులోకి అనువదించబడింది. ఈ పుస్తకాన్ని రచయిత మాతృ భాష తెలుగులో కాకుండా ఇంగ్లీషు లో వ్రాయడానికి కారణం, చదువు యొక్క గొప్పతనం చెప్పడం కోసమే. ఇంగ్లీషు చదివితేనే గొప్ప అని కాదు, కానీ నేటి సమాజంలో విద్యాభివృద్దికి, ఇంగ్లీషు కూడా ఒక సూచనే. ముందు తరం వరకు పాఠశాల విద్య ఎరుగని ఒక కుటుంబం నుంచి ముగ్గురు డాక్టరేట్లు రావడం చిన్న విషయం కాదు.

తెలుగు అనువాదం కూడా చాలా సహజంగా వుంది. మొదటి సారి తెలుగులోనే ఈ పుస్తకం చదివేవారికి, ఇది ఒక అనువాదం అన్న విషయం అస్సలు తెలీనంత బాగా వ్రాసారు.

ఇక రెండవ పుస్తకం ‘సాయంకాలమైంది’, రచయిత గొల్లపూడి మారుతీ రావు గారు.

కథ విషయానికొస్తే, మూడు తరాల ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబ కథ. ఒక అస్పృశ్యుడిని చూసినందుకే వూరు వదిలేసిన తాత నుంచి, సప్త సముద్రాలు దాటి అమెరికా వరకూ వెళ్ళిన మనవడి వరకూ జరిగిన మార్పుల కథ. ఈ పుస్తకం మీద వున్న ఒక ముఖ్యమైన విమర్శ, బ్రాహ్మణిజాన్ని ఎక్కువగా చూపెట్టడం. సనాతన ఆచారాలని విపరీతంగా మెచ్చుకోవటం, అప్పటి కుల వ్యవస్తలో ఏ లోపాలూ లేవన్నట్టు చిత్రీకరించడం ఇలాంటివి, దీన్ని ఒక బాలెన్స్ డ్ రచనగా లేదు అనటం. అది కొంతవరకూ నిజమే అనిపిస్తుంది.

కానీ, ఈ నవల యొక్క ఆయువు పట్టు దీని శైలి. ఇదే నేను చదివిన మొదటి గొల్లపూడి వారి రచన. వారి శైలి అన్ని పుస్తకాల్లోను ఇలానే వుందా, లేక ఈ పుస్తకంలో మాత్రమేనా అనేది, ఇంకా కొన్ని రచనలు చదివి తెలుసుకోవాలి. కానీ ఈ పుస్తకం లో మాత్రం, వారి శైలి అద్బుతం. కాకపోతే వారి శైలి మీద నేను చదివిన మరొక విమర్శ ఏమిటంటే, పాత్రల ద్వారా చెప్పించకుండా వారే దూరి ఎక్కువగా చెప్పారు అన్నది. కానీ ఈ విమర్శ అర్థ రహితం. ఒక రచనని తను చెప్పాలా, తన పాత్రల ద్వారా చెప్పించాలా అన్నది రచయిత ఇష్టం. ఆ విధానం మనకి నచ్చడం, నచ్చకపోవడం వేరే సంగతి. కానీ, వారు ఎలా రాయాలన్నది కూడా మనమే చెప్తే ఇక ఆ రచయిత ఎందుకు?

మరొక ముఖ్యమైన చర్చ, ఈ నవల యొక్క ప్రయోజనం ఏమిటి అని? అసలు ఈ రచన ద్వారా వారు ఏం చెప్పదలుచుకున్నారు అని. నిజమే, ఇది అవసరమైన చర్చే. కానీ, అసలు ఏ ప్రయోజనం ఆశించి ఒక పని చేయాలి? ముఖ్యంగా కళకు ప్రయోజనం ఏమిటి? మనస్సుని రంజింపచేయటమా? లేక సమాజాన్ని ఉద్దరించటమా?

కోడి ముందా? గుడ్డు ముందా? లాంటి  ప్రశ్న ఇది. దీనికి జవాబు, ఎవరి మనసులో వారికి దొరుకుతుంది. దాన్నే మనం వారి అభిప్రాయం అంటాం. మీ అభిప్రాయం ప్రకారం, ఈ రచన మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు.

కానీ గొప్ప కళ యొక్క, ఒక ముఖ్య లక్షణం, వెంటాడటం. మనం అ కళ ని అనిభవించిన తర్వాత కూడా ఆ అనుభూతి మనల్ని వదలకపోవటం. ఆ అనుభూతి ఏదైనా కావచ్చు, భయం, బాధ, ఆనందం, విషాదం, ఏ అనుభూతైనా, ఆ అనుభవం తర్వాత కూడా మనల్ని వెంటాడితే ఖచ్చితంగా అది గొప్ప అనుభవం. మంచైనా, చెడైనా, ఏదైనా సరే. అలా చూస్తే, ఈ పుస్తకం కూడా గొప్ప రచన. చదివిన తర్వాత కూడా ఆ అనుభూతి మనల్ని వదలదు.

ఒకేసారి రెండు విభిన్న ద్వారాలు నా ముందు తెరుచుకున్నట్టనిపించింది, ఈ రెండు పుస్తకాలు చదవగానే. ఏది గొప్ప, ఏది తక్కువ అన్న ప్రసక్తే లేదు. చదువుతున్నంత సేపూ ఊపేసిన రచనలు.

చదివిన తర్వాత ఇంకా చాలా కాలం గుర్తుండిపోయే రెండు పుస్తకాలు ఇవి.

టమాటయుం, బెండకాయుం శనివారం, జూలై 11 2020 

లేతగా నవనవలాడుతున్న బెండకాయ, సైలెంటుగా తన పని తను చేసుకుంటుంది. ఫ్రిడ్జ్ లో ఎంత చలిపెడుతున్నా తట్టుకుంటూ, మౌనంగా  భరిస్తూ, తన కర్తవ్యాన్ని నిర్వర్తించే సమయం కోసం ఎదురు చూస్తూ వున్న ఆ సమయం లో, ఒక రోజు…

ఎర్రగా నిగనిగలాడుతున్న టమోటా ఒకటి తన ఫ్రిడ్జ్ లోకి వచ్చింది. తాగిన నిషా వల్ల వచ్చిన ఎరుపో లేక బాగా ఎరువులేసి పెంచడం వలన వచ్చిన ఎరుపో, అక్కడున్న వేటికీ అర్థం కాలేదు.

టమోటా పొగరుగా ఎవరితోను మాట్లడకపోవటం చూసి మొదట ఎవరూ పట్టించుకోలేదు.

కానీ, ‘టమోటా ల రేటు మండిపతుంది’ అని ఫ్రిడ్జ్ బయట అనుకోవడం మాత్రం అందరికీ వినిపించింది. టమోటా గొప్పదనం అర్థమయ్యాక, అది మాట్లడకపోయినా, అందరూ దానిని గౌరవంగా చూడసాగారు. కానీ బెండకాయ పట్టించుకోలేదు. తన పని తను చేసుకుపోసాగింది. అది చూసిన టమోటా ఈగో దెబ్బతింది. ఎలాగైనా బెండకాయ కన్నా తను గొప్ప అని ఋజువు చేయాలనుకుంది.

పక్కనే వున్న వంకాయతో, బెండకాయ వినేట్టుగా అంది, ‘ఈ రోజు నా రేటెంతో తెలుసా, కిలో 80 రూపాయలు. ఎలా వున్నా ఎగబడి కొంటున్నారు, కానీ కొన్ని కూరగాయలకి నా విలువ తెలీదు’. బెండకాయ విననట్టు నటించింది.

రెచ్చగొట్టటానికి టమోటా మళ్లీ అంది ‘కొన్ని బెండకాయలు ముదిరిపోతాయి, కానీ టమోటాలు ఎప్పటికీ ముదరవు’.

సమాధానమివ్వకపోతె టమోటా ఇలాగే పేలుతూనే వుంటుందని అర్థమైన బెండకాయ, వంకాయతో అంది ‘టమోటాలు ముదరవు కానీ కుళ్ళిపోతాయి, మూణ్ణెళ్ళ క్రితం కొనేవాళ్ళు లేక బస్తాలకు బస్తాలు ఆవులకి మేతగా వేసారు, ఆ విషయం తెలుసో లేదో’.

ఇక టమోటా డైరెక్ట్ ఎటాక్ లోకి దిగింది. బెండకాయ అసలు తగ్గలేదు. ఇద్దరూ తీవ్రంగా వాదించుకున్నారు.

టమోటా: ‘టమోటా పప్పు ఎంత బావుంటుందో తెలుసా?’

బెండకాయ: ‘బెండకాయ పులుసు కన్నానా?’

ట: నాకెంత మంది ఫ్రెండ్స్ వున్నారో తెలుసా?

బెం: నేనొక్కన్ని చాలు.

ట: నన్ను దేంట్లో కలిపితే దానికి పేరు తీసుకొస్తాను, టమోటా పప్పు, టమోటా వంకాయ, టమోటా మునక్కాయ, టమోటా దొసకాయ. చెప్పుకుంటూ పోతే చేంతాడంత. తెలుసా.

బెం: నేను ఎవరితో కలవకుండానే అన్నీ చేస్తాను, బెండకాయ ఇగురు, బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై, బెండకాయ చారు, బెండకాయ పచ్చడి. తెలుసుకో.

ట: నా సర్కిల్ కి చెప్పానంటే, ఒక్క డిన్నర్లో కూడా నువ్వు లేకుండా అంతా మేమే వుంటాము.

బెం: నీకు నీ సర్కిల్ కావాలి, కానీ నేను… I am not one, I am all in one. నాతోనే మొత్తం డిన్నర్ చేసేవాళ్ళు బోలెడు మంది.

ట: రేయ్ య్ య్ య్ య్…..

బెం: ఏంట్రోయ్ య్ య్ య్ య్…..

ఇద్దరూ ఎగిరి ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటున్నారు.

ఇంతలో ఫ్రిడ్జ్ తలుపు తెరుచుకుంది.

‘ఇదేంటీ, టమోటాలూ బెండకాయలు కలిసిపోయాయి. ఎన్ని సార్లు చెప్పానండీ మీకు, కూరగాయల్ని తేగానే సెపరేట్ కవర్లలో పెట్టమని’ బయటినుంచి అరుపు వినిపించింది.

‘ఇప్పుడు వీటన్నింటినీ సెపరేట్ చేయాలి, అదో పని. అయినా, ఈరోజు బెండకాయ టమోటా చేస్తే ఎలా వుంటుంది? వావ్, ఈ రోజు అదే కూర’ మళ్లీ అదే గొంతు అంది ఒక ఎగ్జైట్మెంట్ తో.

కడగడానికి ఒక గిన్నెలో పడ్డప్పుడు, ఒకటినొకటి చూసుకున్నాయి, టమోటా ఇంకా బెండకాయ. ఒక చిన్న నవ్వు రెండిటి మొహాల్లో. నవ్వుతూనే చేతులు కలిపాయి.

ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తున్న భర్త సంతోషంతో అన్నాడు ‘ఇంత అద్బుతంగా ఎలా చేసావు ఈ కూర, బెండకాయ టమోటా కాంబినేషన్ ఇంత బావుంటుందని తెలీదు ఇన్నాళ్ళు’.

-శుభం-

 

PS: ఈ కథకి మరే సినీమా కథకి ఏ విధమైన సంబంధం లేదు అని అనుకుంటే మీరు ఇంకా ఆ సినీమా చూడలేదు అని అర్థం.

The Good, The Better, The Best మంగళవారం, జూలై 7 2020 

చిన్నప్పుడు ‘విచిత్ర కాశీ మజిలీ కథలు’ అనే సీరియల్ దూరదర్షన్ లో వచ్చేది. అందులో హీరో గుర్రం మీద కొండల మధ్య నుంచి వస్తుంటే ఒక చిన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేది, ‘టడటడటా… టా… టా.. టా…’ అంటూ. అప్పుడు నా వయస్సు తొమ్మిది, పదేళ్ళు. తరువాత మరి కొన్నేళ్ళకి, DDLJ సినీమాలో మళ్ళీ ఆ మ్యూజిక్ బిట్ ని విన్నాను. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇంటర్నెట్ యుగం వచ్చాక తెలిసింది 1966 లో వచ్చిన ‘The good, the bad and the ugly’ అనే సినీమాలో మొదటిసారి ఆ మ్యూజిక్ వినపడింది అని. నా లాంటి కోట్ల మందిని మాయ చేసిందని.

ఎన్నియో మొర్రికోన్ ఇక లేరు అన్న విషయం తెలిసింది. ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు, కలవలేదు, మాట్లాడ లేదు. ఆయన గురించి నాకు తెలిసింది ఆయన సంగీతం ద్వారానే. ఆయన్ని చూసిన, కలిసిన, మాట్లాడిన వారందరికీ ఆయన ఇక ముందునుంచి వుండకపోవచ్చు. కానీ ఆయన్ని కేవలం సంగీతం ద్వారా ఎరిగిన నాకు, నేనున్నంతవరకూ, ఆ సంగీతం ద్వారా నాతోనే వుంటాడన్న విషయం నాకు తెలుసు.

 

You live on… Ennio…

రాచకొండ వారి సంతకం సోమవారం, జన 23 2017 

పది రోజుల కిందట వైజాగ్ జగదాంబ జంక్షన్ లో పాత పుస్తకాల దుకాణాలు తిరిగి కొన్ని పుస్తకాలు కొన్నాను. కొన్ని పాతవి, ఇప్పుడు ముద్రణలో లేని పుస్తకాలు దొరికాయని సంబరపడ్డాను, కానీ అంతకంటే ఆనందకరమైన విషయం మరొకటి ఇప్పుడే బయటపడింది. అదేంటంటే,

స్వయానా ఆయన స్వహస్తాలతో సంతకం చేసిన పుస్తకం. ఎవరో శ్రీ బి. రామాంజనేయులు గారికి 21.09.1977 న రచయిత ప్రసాదించిన పుస్తకం 🙂 ఇప్పుడు నా అద్రుష్టం.

img_9169

‘మళరే’ ప్రేమం… మంగళవారం, ఆగ 16 2016 

ఒక . (డాట్)

ఎంతో ఆశతో నేను, నా స్నేహితుడు ‘కడలి ‘ సినీమాకు వెళ్ళాం. అంతకు ముందే ‘నెంజకుళ్ళే’ అన్న తమిళ్ పాటని వినీ, వినీ వున్నామేమో, ఆ ‘గుంజుకున్నా ‘ తెలుగు ని విని, కసి తో బాదేసింది. మనం అయితేనా….. ఆ పాటని ఎలా వ్రాసేవాళ్ళం??? ప్చ్.ప్చ్.ప్చ్.. చ్చొచ్చొచ్చూ…

 

రెండో . (డాట్)

నా ఫ్రెండ్ కి ఫ్రెండ్, మళయాళం లో వచ్చిన ‘ప్రేమం’ అనే సినీమాని 17 సార్లు చూసాడట. ఆశ్చర్యావిస్తు పోయాను… అదేమన్నా ‘షోలే’ నా, లేక ‘ DDL’ ఆ అని…

 

మూడో . (డాట్)

‘ప్రేమం’ సినీమాని మలయాళం లో చూసాను. ‘మళరే’ పాట నచ్చింది. సినీమా కూడా నచ్చింది.

 

 

ఇంకో . (డాట్)

నా ఫ్రెండ్ ఒకాయన ఉన్నట్టుండి ఒక రోజు నా మీద ఒక తవిక లాంటి కవిత వ్రాసి, మిగతా మా అందరి ముందు చదివాడు. అందరం ఆశ్చర్యానందం పొందాం. అప్పట్నుంచీ ఆ కవితా బాణాల్ని ఆయనకి నచ్చిన వాళ్ళ మీద విచ్చలవిడి గా వదుల్తూనే వున్నాడు.

 

మరో . (డాట్)

తెలుగు లో ‘ప్రేమం’ సినీమాని రీమేక్ చేస్తున్నారని చదివాను. మన నేటివిటీ కి తగ్గట్టుగా తీయగలరా? కథ కంటే కూడా ద్రుశ్యం, సంగీతం ముఖ్యమైన సినీమా. సరిగ్గా వస్తుందో లేక మరో ‘ముంగారు మళె ‘ అవుతుందో అన్న ఒక చిన్న అనుమానం.

 

 

చివరి . (డాట్)

మంగళ వారం రోజు ఒక వార్త చదివాను, తెలుగు ‘ప్రేమం’ లోని ‘ఎవరే’ అనే పాట ని మరుసటి బుదవారం రిలీజ్ చేస్తారని. వెంటనే ఒక ఆలోచన…

 

. (డాట్) . (డాట్) . (డాట్) . (డాట్)

Dots

ఇక అన్ని డాట్ లని కలిపేసి ,

….వెంటనే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి ‘మళరే’   పాటని తెలుగు లో వ్రాయ గలరా అని అడిగాను. అఫీషియల్ గా పాట రిలీజ్ కాకముందే వ్రాయాలీ అన్నది ఆలోచన. మూడ్రోజులు ఆలోచించి ఆయన వ్రాసింది ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

ఇంతకు ముందు ఎన్నో సార్లు, పాటల లిరిక్స్ అర్థం కాక, మరికొన్ని నచ్చక, పల్లవుల్లో చరణాల్లో, మాకు నచ్చిన పదాలు పెట్టుకొని పాడుకున్న సందర్భాలున్నాయి.

అలా ఇప్పుడు ఒక పూర్తి పాట. అంతే…

బావుందా, బాలేదా అన్నదాంతో మాకు సంబందం లేదు. సరదాగా కాసేపు గడిపామా లేదా అన్నదే మాకు ముఖ్యం. 🙂

 

ఇక పోతే పాట ఇక్కడ….

అడిగే……

//పల్లవి//

తొలి ఉదయం రవి కిరణం నీ మీద వాలి ; నా కళ్ళలో చేరి కలలాగా మారె!

సుమగంధం నీ నుదుటిని సుతిమెత్తగ తాకి ; నా శ్వాసలో చేరి ప్రాణంగ మారె!

నా కోసం నీ రూపం సృష్టించెను కాలం ; మన కోసం వనమెల్లా విరబూసిన వైనం!

వనదేవత నువ్వే అని వర్షించిన మేఘం : ఆ వర్షంలో జనియించెను ప్రేమానురాగం!

అడిగే…… తనివే తీరగ మది అడిగె

అరెరే…….నా మనసే నీతో జత కలిసే

//చరణం//

నీ అందమె నాపై ఒక మాయ చేసె ; నీ రూపమె నాలో నిలువెల్ల కదిలె!

మనసే నన్నే బతిమాలసాగె ; నీతో చెలిమే కడదాక కోరె!

ఈ కాల మా కాల మే కాలమైనా ;

ఆ లోక మీ లోక మే లోకములో ఉన్నా నీ కోసమే కాద బ్రతికుంది ప్రాణం…..ఎచటుoటివో నా కలా………

కలలాగ వచ్చి నను కొత్తగా మార్చి ; నా జీవితానికి ఒక అర్థం తెలిపావే!

ఆ దేవుడి వరమై నా దేవత నువ్వై

అణువణువు ప్రతి అణువు నీ రుణమేలే………..అడిగే……..

నా కోసం నీ రూపం సృష్టించెను కాలం ; మన కోసం వనమెల్లా విరబూసిన వైనం!

వనదేవత నువ్వే అని వర్షించిన మేఘం : ఆ వర్షంలో జనియించెను ప్రేమానురాగం!

అడిగే……తనివే తీరగ మది అడిగె

అరెరే…….నా మనసే నీతో జత కలిసే

 

ఏమో గుర్రం ఎగరావచ్చు!!! శనివారం, అక్టో 17 2015 

అమ్మాయిగారూ… అమ్మాయిగారూ,

పొద్దుట్నుంచి బువ్వ తినలేదు కదండీ??

అమ్మాయిగారూ… మడిసికి మనేద మంచిది కాదండీ…     మనేద పెట్టుకొని ఏడిస్తే మన కన్నీళ్లే కరుసైపోతాయి, ఏదీ ఆ పాదం సూపండి…

అసలండీ… దేవుడు మనకు కనీళ్లిచ్చింది మనకోసం కాదంటంది, ఎదటోళ్ళకి  బాదోచ్చినప్పుడు మనం కన్నీళ్లు పెట్టాలట… అందుకు… అప్పుడు ఆళ్ళకి దైర్ణం వత్తాది…

నిజమండీ… దొర గారు సెప్పారు. మనకి కట్టవత్తే నవ్వాలటండీ, కాల్లో ముల్లు గుచ్చుకుందనుకోండి, ఏడవకూడదండీ, కంట్లో గుచ్చుకోలేదు గదాని నవ్వాలటండీ… హెహెహె…

ఒక్కథ చెప్పనాన్డి? అనగనగనగా ఓ రాజు గారు, ఆలు ఓడికి ఉరి సిచ్చేసినారు, ఆడు పకపకమని నవ్వాడంటండీ … దానికి రాజు గారు, ‘ఏరా, ఎంటా నవ్వు? ఇప్పుడే సంపేత్తాను’  అన్నారంటండీ. దానికి ఆడు, ‘ఓ రాజా, నాకు ‘రెక్కల గుర్రం’ విద్య తెలుసు, నన్ను గానీ రేపు సంపేశారనుకోండి, ఆ ఇద్య జూసే అదృష్టం మీకెక్కడిదిరా ఎర్రి మొహమా’ అన్నాడటండీ.

‘మరైతే  గుర్రాన్నెగిరించు’ అన్నారు రాజుగారు.

‘నిజంగా ఎగిరించాడా’???

‘ఆస గదే, ఆర్నెల్లు పట్టుద్ది. నాకు గుర్రానికి తిండీ, దాణా, మందులు, మాకులూ కావాలి’ అన్నాడు.

రాజుగారు ‘సరే’ అన్నారు.

రోజూ ఆరంపించే పాలూ, మీగడా, ముప్పాతిక తను తిని, ఆ మిగిలినదాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరిగిపోతుంది వాడికి. ఖైదు లో పక్కనున్నోడు ‘ఏరా, గుర్రం నిజంగా ఎగురుద్దా?’ అన్నాడు.

దానికి వీడు నవ్వేసి, ‘ఉత్తినే, కథ అల్లాను లే’ అన్నాడు.

‘మరైతే అబద్దం చెప్పి లాభమేముందిరా’ అన్నాడు.

‘హి హి హ హ , ఉరి సిచ్చ ఆరు నెల్లు వాయిదా పడింది కదా, ఈ లోగా ఎన్నో జరగొచ్చు,

రాజు గారు మనసు మార్చుకొని నా సిచ్చ రద్దు చేయొచ్చు, రాజు గారే సచ్చిపోవచ్చు, భూకంపం వచ్చి జైలు కూలి పోవచ్చు, సివారాఖరికి, ‘ఏమో, గుర్రం ఎగరావచ్చు’ అన్నాడు.

ఈ ముళ్లపూడి వారి మాటలు అవగానే, వేటూరి వారి పాట…

¯¯¯¯¯¯¯¯¯¯¯¯

కప్పలు అప్పాలయిపోవచ్చు , సున్నం అన్నాలయిపోవచ్చు

నేలను చాపగ చుట్టావచ్చు, నీటితో దీపం పెట్టావచ్చు

ఏమో…. ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

కప్పలు అప్పాలయిపోవచ్చు , సున్నం అన్నాలయిపోవచ్చు

నేలను చాపగ చుట్టావచ్చు, నీటితో దీపం పెట్టావచ్చు

ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఆనాటి నీ తల్లి, ఆకాశ జాబిల్లి

తారలన్నీ నీకు తలంబ్రాలు పోసి,

హరివిల్లు దిగివచ్చి, హరి వంటి పతినిచ్చి వెళ్ళావచ్చు, రోజు మళ్ళా వచ్చు

ఆ మారు తల్లైన, తల్లల్లే తా మారి,

పట్టుచీరలు పెట్టి  పరమన్నాం వడ్డిస్తే,

ఆరారు కాలాల నీ కంటి నీలాలు ఆరా వచ్చు, మనసు తీరావచ్చు

దైవాలు పెట్టేను లగ్గాలు, పెళ్లిళ్ల లోగిళ్లు స్వర్గాలు,

ఆ నింగి, ఈ నేల, పాడాల నీ పాట ఈ పూటా,

పాములు పాలు ఇవ్వావచ్చు, బెబ్బులి పిల్లిగ మారా వచ్చు,

నవ్విన చేను పండా వచ్చు, రోకలి చిగురూ వెయ్యావచ్చు,

ఏమో…. ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఏడింట సూరీడు ఏలుతున్నాడు, రాకుమారుడు నీకు వ్రాసి వున్నాడు,

రతనాల కోటకే రాణి వంటాడు, పగడాల దీవికె దేవి వంటాడు,

గవ్వలు రవ్వలు కానూ వచ్చు, కాకులు హంసలు అయిపోవచ్చు,

రామచిలుక నువ్వు కానూ వచ్చు, రాంబంటు కలా పండావచ్చు,

ఏమో …. ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

ఏమో  గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యావచ్చు.

కప్పలు అప్పాలయిపోవచ్చు , సున్నం అన్నాలయిపోవచ్చు

నేలను చాపగ చుట్టావచ్చు, నీటితో దీపం పెట్టావచ్చు

ఏమో…

¯¯¯¯¯¯¯¯¯¯¯¯

ఇంకా ఏం కావాలి?

రోకలి చిగురూ వెయ్యావచ్చు… ఒక సామెత… ఆలోచిస్తే… మరణం లోంచి జీవితం…

ఇంతకంటే  గొప్ప ఆశావాదం ఎక్కడుంటుంది…

ముషాయిరా మంగళవారం, ఆగ 4 2015 

‘Celebrating the best of Urdu poetry’ selected by Khushwant Singh & Kamna Prasad చదివాను…

ఆరుబయట, చల్లని సాయంత్రం,

ఆగి ఆగి వీస్తున్న గాలుల్లో,

తెల్లని పరుపులు, వాటి మీద గుండ్రని దిండ్లు,

చేతిలో ద్రాక్ష రసం తో నిండిన పాత్ర , అయిపోగానే నింపే సాకీ లతో,

ఒక సాయంత్రమైనా అలాంటి ఉర్దు ముషాయిరా లో,

ఒక షాయరీ అన్నా వినాలన్న కోరిక…

ఎన్నటికీ నెరవేరని కోరిక…

విషాదాన్ని కూడా ఆనందంగా అనుభవించేది అప్పుడేనేమో…

విరహం కూడా తీరకుండా వుంటే బావుండనిపించేది కూడా అప్పుడేనేమో…

అలాంటి సాయంత్రం రాలేదు కానీ, చదవగానే మళ్ళీ మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించినవి… అలాంటివి కొన్ని పై పుస్తకం లో వున్నాయి…

మచ్చుకి కొన్ని…

*ఉర్దూని తెలుగు లో చదవటం కంటే ఇంగ్లిష్ లో చదవటం తేలిక… అందుకే ఉర్దూ కవిత, దాని భావం రెండూ ఇంగ్లీష్ లో వ్రాస్తున్నాను

#

Sunee hikaayat-e-hastee

To darmiyaan sey sunee

Na ibtidaa ke khabar hain

Na intihaa maaloom

Meaning:

When I woke to the story of life,

it was already the middle of the tale,

I know nothing of the beginning,

I’ll know nothing of the end.

#

Khuda tujhey kisee toofaan sey aashnaa kar dey

Ki terey behr kee maujon mein iztiraab naheen

Meaning:

May god grant you the experience of a storm,

The waves of your life’s  ocean are too calm.

#

Khvaab tha ya khayaal tha kyaa thaa

Hijr tha ya vishal thaa kyaa thaa

Chamkee bijlee see par na samjhey hum,

Husn thaa ya Jamaal thaa kya thaa

Meaning:

Was it a dream or a memory of you, I do not know

Was it a separation from you or union, I do not know

Was it lightning that flashed before me, I do not know,

Was it your beauty or his splendor, I do not know.

ఇంతకంటే ఇంకా ఏం కావాలి????

నేను, మరో నేనుతో అసలు నేను… బుధవారం, జూలై 17 2013 

వ్రాసి చాలా రోజులయ్యింది… పెన్ను తుప్పు పట్ట బోయి ఆగింది, తను ప్లాస్టిక్ అని…

‘కీ’ బోర్డు కీసూ మొరాయిస్తున్నాయి…

చదవటం తగ్గనందువల్ల కళ్ళు మాత్రo, మెదడు తో పోటీ పడుతున్నాయి

వ్రాయాలీ ఈ ఈ ఈ ఈ ఈ …. అన్న ఒక్క కోరిక వల్ల పెన్నుని విదిల్చి, బుర్ర యొక్క డొక్క లో తన్ని

మనస్సుని పరుగులు పెట్టించాలనుకున్నా చేతి వేళ్లు మొరాయిస్తున్నాయి…

స్టార్టింగ్ ప్రాబ్లం కదా…

“Today as always, men fall into two groups: slaves and free men. Whoever does not have two-thirds of his day for himself, is a slave, whatever he may be: a statesman, a businessman, an official, or a scholar.”

― Friedrich Nietzsche

 

మా బాబే… మా బంగారే… ఎంత బాగా నిర్వచించావురా తండ్రీ, మా బానిస బతుకుల్ని అనిపించింది. అలా అని నా మీద నేను జాలిపడేంతలో, నాలోని మరో ‘నేను’ ఖస్సున లేచింది… ‘యేవిటీ??? బానిస బతుకా? వుద్యోగాల్లేక ఎంత మంది ఏడుస్తున్నారో తెలుసా? అయినా ఉజ్జోగo, సజ్జోగo చేయకుండా ఏం చేస్తావూ?’ అని దులిపేసింది.

ఈ బానిస బతుకులో అలసిన మొదటి ‘నేను’, ఆ మరో ‘నేను’ కి రిప్లై ఇవ్వటం కూడా దండగని మానేసింది.

ఎందుకంటే ‘నేను’ వ్రాయమంటోంది, ‘వేలు’ వూరుకోమంటోంది.

 

అసలే ప్రపంచ తత్వవేత్తల గురించి చదువుతున్నట్టున్నాను… చిర్రెత్తి వున్నాను…

 

వుందని అన్నోడితో లేదనీ… లేదని అన్నోడితో వుందనీ…

వుండీ లేదని అన్నోడితో, ఏదైనా ఒకటే అనీ…

నాలుకని మూడు వందలా అరవై డిగ్రీ లకీ తిప్పేస్తున్నాను.

వున్నా, పోయినా మనకొచ్చేది  లేదని…

ఇంకా ఏదో చెప్పబోతుంటే, లెన్త్ ఎక్కువవుతుంది ఆపూ..అంటూ ‘నేను’ లేచింది.

వుంటే నీకేంటి? లేకుంటే నీకేంటి? నీ బానిస బతుకుని బాగు చేసుకోరా వెధవాయి… అని వెక్కిరించింది…

దానికి ప్రతిగా మరో ‘నేను’ లేవబోతుంటే… వేలు నోప్పేసి… ఇక్కడాగాం అందరం…

🙂

‘క’ రాజు కథలు బుధవారం, అక్టో 3 2012 

ఇన్ని రోజులూ ఈ పుస్తకం ఎలా మిస్ అయ్యానో తెలీట్లేదు. చలం గారు ఎక్కడో అన్నట్టు, కవి తన కోసం వ్రాసుకుంటాడు, అది చదివాక మనకేం అర్థమవుతుందనేది మన మీద ఆధారపడివుంటుంది. అర్థం చేసుకునేవాడికి మహాగ్రంథాలు అక్కర్లేదు, ఒక వాక్యం చాలు. సింగీతం గారు ఏ వుద్దేశ్యం తో ఇవి వ్రాసారో తెలీదు. హాస్యం ప్రధాన రసమే అయిన… నాకు ఎందుకో అంత కంటే ఎక్కువగా, ఒక్కో కథా ఒక్కో భయంకరమైన సెటైర్ లా అనిపించాయి.
తెలుగు లో హాస్యం అనగానే ఎక్కువ మందికి ‘జంధ్యాల’ గారే గుర్తొస్తారు. ఇక ఆయన్నే పొగుడుతారు. ఆయన గొప్పవాడే, కానీ ఇంకా గొప్పవాళ్లు ఎంత మంది మరుగున వుండిపోయారో అన్న సందేహం వచ్చింది నాకు, ఇవి చదివాక. నా చిన్నప్పుడు, నాలుగో తరగతి అనుకుంటా… అప్పుడు విడుదలయ్యింది, ‘ఆదిత్య 369’, నా చిన్నతనం లో నేను అద్బుతంగా ఫీల్ అయిన విషయాల్లో ఆ సినిమా ఒకటి. ఆ తర్వాత కొంతకాలానికి ‘భైరవ ద్వీపం’ వచ్చింది, మరో మెస్మరైసర్. అసలే చందమామలు, బాలమిత్రలు తెగ చదివేస్తున్న రోజులు… ఈ సినిమా చూశాక నా ఆనందానికి అంతే ముంటుంది…

 

మళ్ళీ ఇన్నాళ్లకు, కేవలం ఆయన పేరు చూసి ఈ పుస్తకం కొన్నాను, నా చిన్నప్పుడు ఆయన సినిమాలతో ఎంత మెస్మరైస్ చేశారో… ఈ పుస్తకం తో అంతకంటే ఎక్కువే మ్యాజిక్ చేశారు.
కొన్ని కథలు…. ఏమని పొగడాలో నాకు తెలీట్లేదు.
సింగీతం గారూ .. మీరు ఇక్కడ పుట్టడం మా అదృష్టం.
కథల్ని నేను వివరించను… మీరంతా ఈ పుస్తకం కొని చదవాల్సిందే… కొన్ని అద్బుతాల పేర్లు మాత్రం ఇక్కడ….
1. గొప్పవాడు
2. నిజాల గోడ
3. పురోగమనం
4. భజన విజయం
5. ఉత్తరజిత్తు – దక్షిణజిత్తు

ఇవన్నీ చదివాక… ఇవేవో, నేటి సమాజం మీద సెటైర్ల లా అనిపించినా, లేక ఇది ఫలానా వ్యక్తి ప్రవర్తనలా అనిపిస్తోందే అని మీకు అనిపించినా. అది కేవలం మీ ఊహ… అంతే…
కానీ ఒకటి మాత్రం నిజం… మీరెన్ని చదివినా… ఇది చదవక పోతే మాత్రం లోటే…

నేడే చదవండి… తప్పక చదవండి 😉

తర్వాత పేజీ »